డీఎంకే విజయానికి పనిచేస్తాం : ప్రశాంత్‌ కిశోర్‌

Update: 2020-02-03 02:59 GMT

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆయన ఖాతాలో మరో పార్టీ చేరిపోయింది. 2021 లో తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ తరుపున పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) పనిచేస్తుందని డిఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్ తెలిపారు." 2021 ఎన్నికలలో మాతో కలిసి పనిచేయడానికి, తమిళనాడుకు పూర్వ వైభవం కోసం మాకు ప్రణాళికలను రూపొందించడంలో సహాయపడటానికి తమిళనాడుకు చెందిన చాలా మంది ఐప్యాక్ మేధావులు పనిచేస్తారని స్టాలిన్ ట్వీట్ చేశారు. అలాగే వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె విజయం సాధించడానికి తమిళనాడులోని ఐప్యాక్ బృందం సహాయపడుతుందని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.

ఈ మేరకు తనకు చెందిన ఐప్యాక్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు అందులో.. "అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు స్టాలిన్.. 2021 ఎన్నికలలో ఘన విజయం సాధించడంలో సహాయపడటానికి ఐఎం-పిఎసి తమిళనాడు బృందం డిఎంకెతో కలిసి పనిచేయడానికి సంతోషిస్తున్నాము.. మీ సమర్థ నాయకత్వంలో రాష్ట్రాన్ని తిరిగి పురోగతి మరియు శ్రేయస్సు మార్గంలో పెట్టడానికి సహాయం చేస్తాం" అని ఐప్యాక్ ట్వీట్ చేసింది. మరోవైపు ఢిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తో కలిసి ఐప్యాక్ టీమ్ పనిచేస్తోంది.

ఆ సంస్థ తన అధికారిక వెబ్‌సైట్‌లో "పౌర-కేంద్రీకృత ఎజెండాను సెట్ చేయడానికి","దీనిని ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి మరియు ప్రజల మద్దతును సేకరించే అత్యంత ప్రభావవంతమైన పద్ధతులను అమలు చేయడానికి" సహాయపడుతుందని పేర్కొంది. కాగా ప్రశాంత్ కిషోర్ 2014 లో ప్రధాని నరేంద్ర మోడీ, 2015 లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, 2017 లో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఎన్నికల ప్రచారాలను నిర్వహించారు. గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ విజయం కోసం ఆయన వ్యూహాలను రచించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ, 22 లోక్ సభ సీట్లతో సంచలన విజయం సాధించింది. అయితే 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ - సమాజ్ వాది పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసినా ఈ ద్వయం విజయం సాధించలేకపోయింది.

Tags:    

Similar News