Military Dog: వీర జాగిలం జూమ్ కన్నుమూత..
Zoom: ఉగ్రవాదులతో పోరాటంలో తీవ్రంగా గాయపడిన వీర జాగిలం జూమ్ కన్నుమూసింది.
Military Dog: వీర జాగిలం జూమ్ కన్నుమూత..
Zoom: ఉగ్రవాదులతో పోరాటంలో తీవ్రంగా గాయపడిన వీర జాగిలం జూమ్ కన్నుమూసింది. రెండు బుల్లెట్లు తగిలిన జూమ్‌ను ఆర్మీ అధికారులు శ్రీనగర్‌లోని అడ్వాన్స్‌డ్ ఫీల్డ్ వెటర్నరీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచినట్టు ఆర్మీ వెల్లడించింది. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చడంలో సైనిక జాగిలం జూమ్ కీలకంగా వ్యవహరించింది. రెండ్రోజుల క్రితం జమ్మూ కశ్మీర్‌లో అనంత్‌నాగ్ జిల్లాలోని తంగ్‌పవాస్‌లో ఓ ఇంట్లో లష్కర్ ఏ తొయిబా ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం అందింది. వెంటనే సైన్యం కూబింగ్ ఆపరేషన్ చేపట్టింది. అందులో భాగంగా తమతో పాటు ఫైటర్ డాగ్ జూమ్‌ను రంగంలోకి దించింది. ఉగ్రవాదులు దాక్కున్న ఇంటిపై సైనికాధికారులు దాడులు చేయాలని నిర్ణయించారు. అయితే ముందుగా ఫైటర్ డాగ్‌ను ఉగ్రవాదులున్న ఇంట్లోకి పంపారు. జూమ్ లోపలకు వెళ్లగానే ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు.
రెండు బుల్లెట్లు దిగినా ఉగ్రవాదులపై జూమ్ ఫైట్ చేసింది. ఉగ్రవాదులు తప్పించుకోకుండా ఫైటర్ డాగ్ అడ్డుకుంది. జూమ్ వెన్నెంటే ఉన్న సైన్యం ఉగ్రవాదులపై ఎదురుదాడులకు దిగింది. ఇద్దరు టెర్రరిస్టులను మట్టికరిపించింది. ఇద్దరు ఉగ్రవాదులు లష్కర్ ఏ తొయిబాకు చెందిన వారిగా ఆర్మీ గుర్తించింది. ఇక ఈ ఆపరేషన్‌లో రెండు బుల్లెట్లతో తీవ్రంగా గాయపడిన వీర జూమ్‌ను హుటాహుటిన శ్రీనగర్‌లోని అడ్వాన్స్‌డ్ వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. దానికి శస్త్రచికిత్స చేశారు. మొదటి రోజు జూమ్ పరిస్థితి నిలకడగానే కనిపించింది. మూడో రోజు జూమ్ శ్వాసను ఎగబీలుస్తూ చివరికి కన్నుమూసిందని ఆర్మీ తెలిపింది. ఫైటర్ డాగ్ జూమ్ కొన్నేళ్లుగా భారత ఆర్మీకి సేవలందిస్తోంది. ఎన్నో ఉగ్రవాద క్రియాశీల కార్యకలాపాలను అడ్డుకుంది. పలువురు ఉగ్రవాదులను మట్టి కరిపించడంలో కీలక పాత్ర పోషించింది. శత్రువులను పసిగట్టి వారి ఉనికిని తెలియజేసేలా జూమ్‌కు ఆర్మీ శిక్షణ ఇచ్చింది.
చాలా కాలంగా భద్రతా బలగాలకు ఫైటర్ డాగ్ జూమ్ సహకరించింది. జూమ్ అత్యంత శిక్షణ పొందిన నిబద్ధత గల జాగిలమంటూ సైనికాధికారులు తెలిపారు. వీర జాగిలానికి ఆర్మీ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. తాజాగా చినార్ కార్ప్స్‌కు చెందిన విభాగం జూమ్ డాగ్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఇదిలా ఉంటే.. రెండు నెలల క్రితం ఆర్మీ చేపట్టిన ఓ ఆపరేషన్‌లో జాగిలం ఆక్సెల్.. వీర మరణం పొందింది. జులైలో జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ చేపట్టాయి. రెండున్నరేళ్ల వయస్సున్న ఆక్సెల్.. ఓ ఉగ్రవాదిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించింది. 8 గంటల పాటు జరిగిన ఆపరేషన్‌లో టెర్రరిస్టును గుర్తించి.. ఆర్మీకి సహకరించింది. వాసన చూస్తూ వెళ్లి... ఉగ్రవాదిపై దాడికి దిగింది. టెర్రరిస్టు కాల్పులు జరపడంతో ఆక్సెల్ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో ఉగ్రవాదిని సైన్యం మట్టుబెట్టింది. విరోచితంగా పోరాడిన వీర జాగిలానికి మెన్షన్ ఇన్ డిస్పాచెస్ అవార్డుతో ఆర్మీ సత్కరించింది.
జమ్మూ కశ్మీర్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. ఏ మూలన ఏ టెర్రరిస్టు దాక్కుని దాడికి దిగుతాడో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులను గుర్తించేందుకు ఆర్మీ జాగిలాలను వినియోగిస్తుంది. కశ్మీర్‌లో టెర్రరిస్టులను అంతమొందించడంలో ఈ జాగిలాలు అత్యంత కీలకంగా మారాయి. టెర్రరిస్టుల జాడను కనిపెట్టి.. సైన్యానికి సహకరిస్తాయి. కొన్ని సార్లు సునకాలకు కెమెరాలను, జీపీఎస్ పరికరాలను అమర్చి.. ఉగ్రవాదుల స్థావరాల్లోకి పంపుతున్నారు. ఉగ్రవాదుల వద్ద ఉన్న ఆయుధాలను, వారు ఎంత మంది ఉన్నారో గుర్తించి అందుకు తగినట్టు వ్యూహాలను సిద్ధం చేసి దాడులకు దిగుతారు. ఈ క్రమంలో ఫైటర్ జాగిలాలతో సైన్యం ఎన్నో ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసింది.