విద్యార్థుల ర్యాలీలో తుపాకీతో యువకుడు హల్చల్.. ఒకరికి గాయాలు..

Update: 2020-01-31 06:12 GMT

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) మరియు జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి) కు నిరసనగా ఢిల్లీ లోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం నుంచి రాజ్‌ఘాట్‌కు నిరసన ప్రదర్శన నిర్వహించారు విద్యార్థులు. ఈ ప్రదర్శనలో ఒక వ్యక్తి తుపాకితో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. భారీగా మోహరించిన పోలీసులు, మీడియా ప్రతినిధుల సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. పోలీసులు వెంటనే దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన విద్యార్థిని షాదాబ్‌గా గుర్తించారు. అతను జామియా మిలియా విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ చదువుతున్నట్టు తెలుస్తోంది. ఆ యువకుడిని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో చేర్చారు. నిరసన ప్రదర్శన చేసిన ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించారు. అయినప్పటికీ నిందితుడు మైనర్ తుపాకీతో కాల్పులు జరిపాడని.. ఆ వ్యక్తి బహిరంగంగా ఆయుధాన్ని పట్టుకు తిరిగాడని..

కాని పోలీసులు అతన్ని ఏమీ చేయలేదని ఘటనా స్థలంలో ఉన్న ప్రజలు అంటున్నారు. ఆ వ్యక్తి నిరసనకారుల వైపు దూసుకెళుతున్నా ఆ సమయంలో, పోలీసులు నిశ్శబ్దంగా చూస్తూనే ఉన్నారని అన్నారు. కాల్పుల ఘటనతో జామియా నగర్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులకు మద్దతుగా వందలాది మంది స్థానికులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. బారికేడ్లను ధ్వంసం చేసి యూనివర్సిటీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే భద్రతా బలగాలు వారిని అడ్డుకున్నాయి. పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం ఉందని గ్రహించిన అధికారులు.. అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించాయి. ఈ సందర్భంగా పోలీసులకు, స్థానికులకు మధ్య తోపులాట జరిగింది. ఘటనాస్థలంతోపాటు వర్సిటీ ప్రాంతంలో అర్ధరాత్రి వరకు నిరసనలు కొనసాగాయి. ఘటనపై సౌత్ ఈస్ట్ ఢిల్లీకి చెందిన డిసిపి చిన్మయ్ బిస్వాల్ స్పందించారు.. యువకుడు బహిరంగంగా పిస్టల్ ఊపుతూ కనిపించాడని.. అతన్ని పట్టుకున్నామని తెలిపారు. తమ వద్ద ఉన్న వీడియోను పరిశీలిస్తున్నామన్న డీసీపీ.. యువకుడిని ప్రశ్నిస్తున్నట్టు చెప్పారు. ఇక ఈ ఘటనకు బీజేపీనే కారణమంటూ వామపక్షాలు, ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ లు ఆరోపించాయి. 

Tags:    

Similar News