Mamata Banerjee: సీఎం గా బెంగాల్ కీ బెహన్ ఈ నెల 5న ప్రమాణస్వీకారం
Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మరోమారు సీఎం పగ్గాలు చేపట్టనున్నారు.
Mamata Banerjee:(File Image)
Mamata Banerjee: మే 5వ తదీన మమతా బెనర్జీ(బెంగాల్ కీ బెహన్) సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి, సీనియర్ నేత పార్థ ఛటర్జీ తెలిపారు. ఇప్పటికే తృణమూల్ శాసనసభాపక్ష నాయకురాలిగా మమతను ఎన్నుకున్నారు. బెంగాల్ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనంతగా టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఎనిమిది విడతల పాటు సుదీర్ఘంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలను మమత ఒంటిచేత్తో ఎదుర్కొన్నారు.
ముచ్చటగా మూడోసారి.. అది కూడా గత రెండుమార్లకు మించిన సీట్లతో అధికారం చేపట్టబోతున్న బెంగాల్ దీదీ మమతా బెనర్జీకి తాజా విజయాన్ని పెద్ద ఎత్తున సంబరం చేసుకోకుండా అడ్డు పడింది నందిగ్రామ్ లో తన ఓటమి. పైకి ఎలెక్షన్ కమిషన్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించవచ్చు గానీ.. దీదీ మనసులో మాత్రం ఈలోటు పూడ్చలేనిదిగానే చెప్పుకోవాలి. మమతా నందిగ్రామ్‌లో.. బీజేపీ నేత సువేందు అధికారిపై ఓటమి పాలయ్యారు. కాగా.. మూడోసారి కూడా మమతా బెనర్జీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. అనంతరం ఆరు నెలల లోపు మమతా ఎక్కడో ఒకచోట ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది.
చిన్న గాయానికి 40 రోజుల పాటు కాలికి కట్టు కట్టుకుని, వీల్ చైర్‌లో ప్రచారం చేసి సెంటిమెంటును క్యాష్ చేసుకున్న మమతా బెనర్జీ.. ఫలితాలకు ఒక్క రోజు ముందు కాలికి కట్టు తీసేసి.. ఫుట్ బాల్ పట్టుకుని ఆడుతూ కనిపించారంటే తన గాయంతో బెంగాలీయుల్లో సెంటిమెంటుకు ఎంతగా ప్రయత్నించారో అర్థం చేసుకోవచ్చు. ఇదే క్రమంలో మరోసారి సెంటిమెంటు రాజేయడం ద్వారా తనకు తాజా ఫలితాల్లో లోటుగా మిగిలిన దాన్ని సరిచేసుకునేందుకు మమతా బెనర్జీ సిద్దమవుతున్నారు.