రైతు సంఘాల నేతలపై FIR నమోదు.. సింఘి బోర్డర్‌ వద్ద పరిస్థితి ఇంకా ఉద్రిక్తం

*రైతు నేతలకు పోలీసుల నోటీసులు *పలువురు రైతు సంఘాల నేతలపై FIR నమోదు *కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు నిర్ణయం

Update: 2021-01-28 11:00 GMT

రైతు సంఘాల నేతలపై FIR నమోదు.. సింఘి బోర్డర్‌ వద్ద పరిస్థితి ఇంకా ఉద్రిక్తం

ఢిల్లీ పోలీసులు దూకుడు పెంచారు. గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడంపై సీరియస్‌ యాక్షన్‌కు దిగుతున్నారు. ట్యాక్టర్‌ ర్యాలీ ఒప్పందం ఉల్లంఘించిన కీలక రైతు నేతలకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లోగా తమకు సమాధానం చెప్పాలని ఆదేశించారు. స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్, బల్దేవ్ సింగ్ సిర్సా, బల్బీర్ ఎస్. రాజేవల్ సహా 20 మంది నాయకులు నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. ఇప్పటికే రైతులకు నాయకత్వం వహిస్తున్న రాకేశ్ టికాయత్, గుర్నాంసింగ్‌ చాదుతో సహా పలువురు రైతు సంఘాల నేతలపై FIR నమోదయింది. తాజాగా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సింఘి బోర్డర్‌ వద్ద పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. స్థానిక ప్రజల నుంచి రైతులు నిరసన ఎదుర్కొంటున్నారు. రైతులను అక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయమని వారు కోరుతున్నారు. మరోవైపు రేపు జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో కూడా వ్యవసాయ బిల్లు అంశం కీలకంగా మారనుంది. రేపు ఉదయం ఉభయ సభల నుద్దేశించి రాష్ట్రపతి చేయనున్న ప్రసంగానికి హాజరుకాకూడదని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. విపక్షాలను సంప్రదించకుండా వ్యవసాయ చట్టాలను బలవంతంగా ఆమోదింపచేశారని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Tags:    

Similar News