ప్రమాణస్వీకారానికి 'లిటిల్ కేజ్రీవాల్'.. ముందువరుసలో సీట్..
అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు వరుసలో ప్రత్యేక అతిథి కూర్చుని అందరికి కనిపిస్తారు.
అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు వరుసలో ప్రత్యేక అతిథి కూర్చుని అందరికి కనిపిస్తారు. ఆ అతిథి మరెవరో కాదు, 'లిటిల్ కేజ్రీవాల్' గా ఖ్యాతి గడించిన ఒక సంవత్సరపు బాలుడు అవియన్ తోమర్. ఢిల్లీలో ఆప్ మరోసారి ఘనవిజయం సాధించడంతో ఈనెల 11న ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ విజయోత్సవ వేడుకలో కేజ్రీవాల్ లాగా మఫ్లర్, టోపీ మరియు మీసాలతో అవ్యాన్ దర్శనమిచ్చాడు. దాంతో ఆ బుడ్డోడు ఢిల్లీ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాడు. ఆ బుడ్డోడు ఆప్ కార్యకర్త రాహుల్ తోమర్ మరియు మీనాక్షి తోమర్ల కుమారుడు.. ఎన్నికల అనంతరం అవ్యాన్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు.. అంతేకాదు ఆప్ అగ్రనాయకులు దృష్టిని ఆకర్షించాడు.
ఈ క్రమంలో కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన వలసిందిగా అవ్యాన్ కుటుంబాన్ని ఆహ్వానించారు ఆప్ అగ్రనాయకులు. ఈ సందర్బంగా "మమ్మల్ని వేడుకకు ఆహ్వానించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అవ్యాన్ కు కేవలం ఒక సంవత్సరం వయస్సు ఉన్నప్పటికీ, 'లాగే రహో కేజ్రీవాల్ పాట' విన్నప్పుడు వెంటనే డాన్స్‌లోకి ప్రవేశిస్తాడు.. నీది ఏ పార్టీ అంటే 'ఆప్' అని టక్కున చెప్తాడు" అని కేజ్రీవాల్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించడంతో ఉత్సాహంగా ఉన్న రాహుల్ తోమర్ అన్నారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఉదయం 10 గంటలకు రామ్‌లీలా మైదానంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించినప్పటికీ, ఆయన వారణాసిలో ఉన్నందున తాను ఈ కార్యక్రమానికి హాజరు కాలేనని కేజ్రీవాల్ కు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం సందర్బంగా ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాంలీలా మైదానం చుట్టూ మూడంచెల భద్రతను ఉంచారు. సుమారు 5,000 మంది పోలీసు సిబ్బంది, 125 సిసిటివి కెమెరాలు, 12 ఎల్‌ఇడి స్క్రీన్లు, 45,000 కుర్చీలు ఉంటాయని సీనియర్ అధికారులు తెలిపారు. ప్రజలు నిలబడి ఈ కార్యక్రమాన్ని చూడటానికి తగినంత స్థలం కూడా ఉంటుందని అధికారి తెలిపారు.