భర్త గ్యాంగ్‌కు లీడర్: ఎవరీ లేడీ డాన్ జోయాఖాన్?

Zoya Khan: లేడీ డాన్ జోయా ఖాన్‌ను దిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. గ్యాంగ్ స్టర్ హషీం బాబా భార్యే జోయా ఖాన్.

Update: 2025-02-21 06:57 GMT

భర్త గ్యాంగ్‌కు లీడర్: ఎవరీ లేడీ డాన్ జోయాఖాన్?

Zoya Khan: లేడీ డాన్ జోయా ఖాన్‌ను దిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. గ్యాంగ్ స్టర్ హషీం బాబా భార్యే జోయా ఖాన్. అంతర్జాతీయ మార్కెట్ లో కోటి రూపాయాల విలువైన 270 గ్రాముల హెరాయిన్ కలిగి ఉన్నందున ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

చాలా కాలంగా ఆమె పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఆమెపై అనుమానాలున్నప్పటికీ అందుకు సంబంధించిన ఆధారాలు పోలీసుల వద్ద లేవు. చివరికి ఆమె వద్ద హెరాయిన్ ను కలిగి ఉందని పోలీసులు అరెస్ట్ చేశారు. 2017లో హషీం బాబాను పెళ్లి చేసుకోవడానికి ముందు జోయాకు మరో వ్యక్తితో పెళ్లైంది. భర్తకు ఆమె విడాకులిచ్చింది. విడాకుల తర్వాత బాబాతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమకు దారితీసింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. హషీం బాబాకు జోయా ఖాన్ మూడో భార్య.

లేడీ డాన్ గా అవతారం

హషీం బాబాపై హత్య, దోపీడీ, ఆయుధాల అక్రమ రవాణాకు సంబంధించి డజన్ల కొద్ది కేసులున్నాయి. బాబా జైలుకు వెళ్లిన తర్వాత భర్త నడిపే గ్యాంగ్ బాధ్యతలను ఆమె తీసుకున్నారు. ఆమె హై ప్రొఫైల్ పార్టీలకు తరచుగా వెళ్లేది. లగ్జరీ జీవితాన్ని గడిపేది. ఆమెకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫాలోవర్లు ఉన్నారు. తీహార్ జైలులో ఉన్న తన భర్తను జోయా తరచుగా కలిసేది. జోయాకు కోడ్ భాషలో ఆమె భర్త శిక్షణ ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. గ్యాంగ్ ను నడపడంలో కూడా ఆయన వద్ద ఆమె సలహాలు, సూచనలు తీసుకుంది. హషీం సహచరులతో ఆమె సంబంధాలు కొనసాగించింది.

కొంత కాలంగా ఆమెపై నిఘా పెట్టారు దిల్లీ పోలీసులు. స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ, ఈ ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వలేదు. అయితే తాజా ప్రయత్నాల్లో పోలీసులు విజయం సాధించారు. ఈశాన్య దిల్లీలోని వెల్ కమ్ ఏరియాలో జోయాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి హెరాయిన్ ను సీజ్ చేశారు.

నాదిర్‌షా హత్య కేసులో ప్రమేయం ఉన్న షూటర్లకు కూడా జోయా ఆశ్రయం కల్పించారని పోలీసులు అనుమానిస్తున్నారు. దక్షిణ దిల్లీలోని గ్రేటర్ కైలాష్ 1 ప్రాంతంలో జిమ్ యజమాని షా ను 2024 సెప్టెంబర్ లో దుండగులు హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి గత నెలలో ఆమెను పోలీసులు విచారించారు.

కుటుంబ నేపథ్యం

జోయా కుటుంబ సభ్యులకు కూడా నేర చరిత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు. సెక్స్ ట్రాపికింగ్ కేసులో ప్రమేయం ఉందనే అనుమానంతో జోయా తల్లిని 2024లో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె బెయిల్ పై బయటకు వచ్చారు. ఆమె తండ్రికి డ్రగ్స్ సరఫరా నెట్ వర్క్ లతో సంబంధాలున్నాయనే ఆరోపణలున్నాయి. ఈశాన్య దిల్లీలోని ఉస్మాన్ పూర్ నుంచి తన కార్యకలాపాలను జోయా నిర్వహించేది. ఆమె వెంట సాయుధులైన నలుగురైదుగురు అనుచరులు ఉండేవారు. వీరు ఆమె భర్త విధేయులు.

ఈశాన్య దిల్లీ ప్రాంతంలో చెను గ్యాంగ్, హషీం బాబా గ్యాంగ్, నాసిర్ పహిల్వాన్ గ్యాంగ్ లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ గ్యాంగ్ లు తొలుత డ్రగ్స్ సరఫరాపై ఫోకస్ పెట్టాయి. ఈ గ్యాంగ్ ల మధ్య విబేధాలు హింసాత్మక ఘటనలకు దారి తీశాయి. హషీం బాబా గ్యాంగ్ ఆదాయం ఎక్కువగా జోయాకు దక్కిందని చెబుతుంటారు.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో సంబంధాలు

గత ఏడాది నాదిర్‌షా హత్య కేసులో బాబా పేరు బయటకు వచ్చింది. నాదిర్ షా హత్య కేసులో తన ప్రమేయాన్ని బాబా అంగీకరించారని పోలీసులు చెబుతున్నారు. జైలు నుంచే ఈ హత్యకు ఆయన స్కెచ్ వేశారు. సిద్దూ మూసేవాలా, సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉంది. జైలులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో బాబాకుపరిచయం ఏర్పడింది.వేర్వేరు జైళ్లలో ఉన్నప్పటికీ ఫోన్లు లేదా వీడియో కాల్స్ ద్వారా వీరిద్దరూ మాట్లాడుతూ తమ కార్యకలాపాలను సమన్వయం చేసుకుంటున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News