డీకే శివకుమార్ ఇంట్లో సీఎం సిద్ధరామయ్య అల్పాహార విందు.. తామిద్దరం కలిసే ఉన్నామని స్పష్టం చేసిన ఇరువురు నేతలు
కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తి రేపిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అల్పాహార విందు భేటీ ఇవాళ ముగిసింది.
కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తి రేపిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అల్పాహార విందు భేటీ ఇవాళ ముగిసింది. బెంగళూరులోని సదాశివనగర్‌లో ఉన్న శివకుమార్ నివాసంలో సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశం అనంతరం ఇరువురు నేతలు తాము ఐక్యంగా ఉన్నామని, కలిసికట్టుగా పనిచేస్తామని సిద్దిరామయ్య వెల్లడించారు. ముఖ్యమంత్రి మార్పు అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం, రాహుల్ గాంధీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
తాను, శివకుమార్ అన్నదమ్ముల్లాంటి వాళ్లం అని సీఎం సిద్ధరామయ్య అన్నారు. పార్టీ కోసం ఎప్పుడూ కలిసే పనిచేస్తామని.. శివకుమార్ ఎప్పుడు సీఎం అవుతారని కొందరు అడుగుతున్నారని చెప్పారు. అధిష్ఠానం ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడే అవుతారు అని బదులిచ్చారు. ఈ నెల 8 నుంచి జరిగే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలిపారు. బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతోందని, ఆ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటామని వివరించారు.