Lamborghini Accident: మద్యం మత్తులో లంబోర్గిని బీభత్సం: ఆరుగురికి తీవ్ర గాయాలు.. ప్రముఖ వ్యాపారి కుమారుడి అరెస్ట్!
Kanpur Lamborghini Accident: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆదివారం అర్థరాత్రి వేళ ఓ లగ్జరీ కారు మృత్యుశకటంలా దూసుకొచ్చింది.
Kanpur Lamborghini Accident: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆదివారం అర్థరాత్రి వేళ ఓ లగ్జరీ కారు మృత్యుశకటంలా దూసుకొచ్చింది. మద్యం మత్తులో ఉన్న ఒక యువకుడు తన లంబోర్గిని కారుతో పాదచారులపైకి దూసుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అతివేగం.. మద్యం మత్తు.. అదుపుతప్పిన కారు!
స్థానిక ప్రముఖ పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రా, మద్యం మత్తులో కారును అతివేగంగా నడుపుతూ తొలుత ఒక ఆటోను ఢీకొట్టాడు. ఆపై నియంత్రణ కోల్పోయిన కారు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించగా, ఆగ్రహించిన స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
బౌన్సర్ల దౌర్జన్యం.. పోలీసుల రంగప్రవేశం
ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే వ్యాపారి కేకే మిశ్రా తన వ్యక్తిగత బౌన్సర్లతో కలిసి మరో కారులో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో బౌన్సర్లు స్థానికులపై దౌర్జన్యం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు లంబోర్గిని కారును స్వాధీనం చేసుకుని, శివం మిశ్రాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
మరోసారి తెరపైకి ‘కేకే మిశ్రా’ అక్రమ ఆస్తుల బాగోతం!
ఈ ప్రమాదంతో పొగాకు దిగ్గజం కేకే మిశ్రా అక్రమ ఆస్తుల వ్యవహారం మళ్ళీ చర్చనీయాంశమైంది. 2024లో ఐటీ దాడుల సమయంలో మిశ్రా కంపెనీ టర్నోవర్ రూ.150 కోట్లు ఉండగా, కేవలం రూ.25 కోట్లుగా చూపిస్తూ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. మిశ్రా గ్యారేజీలోని లగ్జరీ కార్ల విలువే దాదాపు రూ.50 కోట్లు ఉంటుందని సమాచారం. తాజాగా ప్రమాదానికి గురైన లంబోర్గిని కూడా ఈ అక్రమ ఆస్తుల దర్యాప్తు పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.