Amita Singh Tomar: కేబీసీలో రూ.50 లక్షల విజేత.. స్కామ్ కేసులో ఇప్పుడు అరెస్ట్!
Amita Singh Tomar: మధ్యప్రదేశ్‌లో సంచలనం: కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) విజేత, తహసీల్దార్ అమితా సింగ్ తోమర్ అరెస్ట్.
Amita Singh Tomar: కేబీసీలో రూ.50 లక్షల విజేత.. స్కామ్ కేసులో ఇప్పుడు అరెస్ట్!
Amita Singh Tomar: ఒకప్పుడు ప్రముఖ టెలివిజన్ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC)లో పాల్గొని లక్షలాది రూపాయలు గెలుచుకుని వార్తల్లో నిలిచిన మహిళా అధికారి, ఇప్పుడు అవినీతి కేసులో అరెస్టై జైలు పాలయ్యారు. రూ.2.5 కోట్ల వరద సహాయక నిధుల స్కామ్‌లో గ్వాలియర్‌కు చెందిన తహసీల్దార్ అమితా సింగ్ తోమర్‌ను పోలీసులు అరెస్టు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వరద నిధుల దారిమళ్లింపు:
కేసు వివరాల్లోకి వెళితే.. 2021లో గ్వాలియర్‌లోని బరోడా ప్రాంతంలో సంభవించిన వరద బాధితుల కోసం ప్రభుత్వం నిధులను కేటాయించింది. అయితే, ఈ సహాయక నిధుల్లో సుమారు రూ.2.5 కోట్లను నకిలీ ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ భారీ కుంభకోణంలో తహసీల్దార్ అమితా సింగ్ తోమర్ కీలక పాత్ర పోషించారనే ఆరోపణలతో పోలీసులు ఆమెను నిందితురాలిగా చేర్చారు.
పరారీ నుంచి జైలుకు:
కేసు నమోదైనప్పటి నుంచి అమితా సింగ్ విధులకు హాజరుకాకుండా పరారీలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆమెకు చుక్కెదురైంది. తాజా సమాచారం ప్రకారం, గ్వాలియర్ పోలీసులు గురువారం రాత్రి ఆమె ఆచూకీ కనిపెట్టి అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం ఆమెను జైలుకు తరలించారు. ఇప్పటికే ప్రభుత్వం ఆమెను తహసీల్దార్ బాధ్యతల నుంచి తొలగించింది.
కేబీసీ-5లో సత్తా చాటిన అమితా:
2011లో అమితా సింగ్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి' సీజన్-5లో పాల్గొని ఏకంగా రూ.50 లక్షలు గెలుచుకున్నారు. ఆ సమయంలో ఒక మహిళా అధికారిగా ఆమె సాధించిన విజయం మధ్యప్రదేశ్‌లో పెద్ద సెన్సేషన్ అయ్యింది. అయితే, అదే పాపులారిటీ ఇప్పుడు ఆమెను అవినీతి ఆరోపణల రూపంలో వెన్నాడుతోంది.