ప్రపంచానికి ప్రధాని మోడీ ఆఫర్‌.. ప్రపంచ దేశాలకు ఆహారం అందించేందుకు సిద్ధం...

Narendra Modi: మోడీ వ్యాఖ్యలతో ప్రపంచ దేశాలకు ఊరట...

Update: 2022-04-13 03:31 GMT

ప్రపంచానికి ప్రధాని మోడీ ఆఫర్‌.. ప్రపంచ దేశాలకు ఆహారం అందించేందుకు సిద్ధం...

Narendra Modi: ప్రపంచ దేశాలు అవసరాల కోసం ఇండియాను ఎలా వాడుకుంటున్నాయో చూస్తూనే ఉన్నాం... కానీ ఇండియా మాత్రం అలా కాదు... ప్రపంచ కష్టాన్ని తన కష్టంగా భావించింది. తనకు ప్రపంచం నుంచి సపోర్ట్ రాకున్నా... ఇండియా మాత్రం ఎప్పుడూ ఎవరి పొట్టా కొట్టాలనుకోలేదు. మీరు మావైపే ఉండాలి... మీరు అలా ఉండాలి... ఇలా ఉంటాలంటూ అమెరికాతో సహా పాశ్చాత్య దేశాలు ఇండియాపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నా... మనం మాత్రం శాంతి మంత్రం జపించాం... జపిస్తూనే ఉన్నాం.. ఇది తరతరాల ఇండియా సర్వమానవసౌభ్రాతృత్వం.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత... ఇండియాలో చమురు సంక్షోభం ఎదురైనా... అమెరికా మాత్రం... తాను చెప్పిందే వినాలంటూ మంకుపట్టుపడుతుంటే... ఇండియా ఎవరికీ తలవొంచలేదు. యుద్ధం వేదికగా... అమెరికా అరాచకత్వం... ఉక్రెయిన్ చేతగాని తనం.. రష్యా దుర్నీతితో శిధిలమవుతున్న ఉక్రెయిన్ వాసులకు ఆహారాన్ని అందించేందుకు నేనున్నానంటోంది భారతవాని. ప్రపంచమంతా ఆహార కొరతతో విలవిలలాడుతున్న వేళ.. ప్రధాని మోడీ ఊరటనిచ్చే వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచ వాణిజ్య సంస్థ కోరుకుంటే.. ప్రపంచ దేశాలకు ఆహార నిల్వలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. తమకు కావాలనుకున్నది దొరకక ప్రపంచ దేశాలు అనిశ్చితి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని అభిప్రాయపడ్డారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కొన్ని ఇబ్బందులకు దారి తీస్తే.. ఇదే సమయంలో ప్రపంచం మరో కొత్త సమస్య ఎదుర్కొంటోందని బదులిచ్చారు. కొన్ని దేశాల్లో ఆహార నిల్వలు తరిగిపోతున్నాయని, ఆహార ఉత్పత్తులతో పాటు.. ఇందనాలు, నూనెలు, ఎరువులు కూడా దొరకని పరిస్థితి తలెత్తిందన్నారు మోడీ.

వీటిని సమకూర్చుకోవడం.. పలు దేశాలకు సమస్యాత్మకంగా మారిందని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన తర్వాత తమ నిల్వలను భద్రపరచుకోవాలని ప్రతిఒక్కరూ జాగ్రత్తపడుతున్నారని అన్నారు ప్రధాని. భారత్‌లో ఇప్పటికే సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయనీ.. కాబట్టి ప్రపంచానికి ఆహారం అందించటానికి భారత్ సిద్దంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచ వాణిజ్య సంస్థ ముందుకు వస్తే నేటి నుంచే ఆహారాన్ని సరఫరా చేస్తామన్నారు మోడీ.

ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మాట్లాడిన సందర్భంలో ప్రతిపాదించానని గుర్తుచేశారు ప్రధాని. ప్రపంచానికి అన్నం పెట్టేందుకు రైతులు కూడా సిద్ధంగా ఉన్నారని... కాకపోతే.. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని మోడీ గుర్తు చేశారు. ప్రపంచానికి ఆహారం సరఫరా చేసేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ అనుమతి ఎప్పుడు ఇస్తుందో తెలియదంటూ ఓ చిరునవ్వు చిందించారు మోడీ.

Tags:    

Similar News