Housing Scheme: ప్రభుత్వ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులకు సొంత ఇల్లు పథకం

Update: 2025-01-19 07:45 GMT

ప్రభుత్వ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులకు సొంత ఇల్లు పథకం

Housing Scheme for Government Employees: రాజకీయ పార్టీలు ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓటర్లను తమవైపు తిప్పుకోవడం కోసం అనేక హామీలు గుప్పిస్తుంటాయనే విషయం తెలిసిందే. ఓటర్లు కూడా సామాజిక వర్గాల వారీగా, వివిధ వృత్తుల వారీగా, ఉద్యోగాల వారీగా ఉంటారు. అందుకే అన్ని వర్గాల వారిని ఆకర్షించడం కోసం వారి వారి అవసరాలకు అనుగుణంగా పార్టీలు హామీలు ఇస్తుంటాయి. అందులోనూ ఏ ఓటరుకైనా సొంత ఇల్లు అనేది ఒక పెద్ద కల. అది దృష్టిలో పెట్టుకునే రాజకీయ పార్టీలు తమ మేనిఫేస్టోలో అది కచ్చితంగా ఉండేలా చూసుకుంటాయి.

అయితే, ప్రభుత్వ ఉద్యోగులు అనేటప్పటికి వారికి రేషన్ కార్డు ఉండదు. అలాగే కొన్నిరకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వారు అర్హులు కారు. చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు అర్హత లేని పథకాల జాబితాలో హౌజింగ్ స్కీమ్ కూడా ఒకటి. కానీ తాజాగా వారికి కూడా ఒక కొత్త హౌజింగ్ స్కీమ్ అందిస్తామని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది.

త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీజేపి, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పోటాపోటీగా హామీలు ఇస్తున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికుల కోసం ఒక కొత్త హౌజింగ్ స్కీమ్ ప్రతిపాదించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఆ వివరాలను వెల్లడించారు. పారిశుధ్య కార్మికులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ఒక పథకం రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇదే విషయమై తాను ప్రధాని మోదీకి లేఖ రాశానన్నారు. 

సర్వీసులో ఉన్నంత కాలం ఓకే.. మరి ఆ తరువాత? - కేజ్రీవాల్

పారిశుధ్య కార్మికులే ఢిల్లీ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారని అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇందులో వారి పాత్ర అమోఘమైనదని ప్రశంసించారు. సర్వీసులో ఉన్నంత కాలం వారు ప్రభుత్వం ఇచ్చే క్వార్టర్స్‌లో ఉంటున్నారు. కానీ సర్వీస్ పూర్తయ్యాకా వారు రోడ్లపై పడుతున్నారు. ఎందుకంటే వారికి వచ్చే పెన్షన్ వారి ఇంటి అద్దెకు సరిపోవడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామంది పరిస్థితి ఇదేనన్నారు.

"ఢిల్లీ లాంటి నగరంలో సొంతిల్లు లేకుండా బతకడం కష్టం. సెంథిల్లు కట్టుకోవడం కష్టం. అందుకే వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ సర్కారుకు స్థలం కేటాయిస్తే... ఆ స్థలంలో తమ ప్రభుత్వా వారికి ఇండ్లు కట్టించి ఇస్తుంది. తరువాత వారు సులభతరమైన ఇన్‌స్టాల్‌మెంట్స్ పద్ధతిలో ప్రభుత్వానికి ఈఎంఐలు చెల్లించేలా ఈ కొత్త హౌజింగ్ స్కీమ్ ఉంటుంది" అని అర్వింద్ కేజ్రీవాల్ తెలిపారు.

ప్రభుత్వ స్థలం కేటాయింపుల విషయంలో కేంద్రానికి లేఖ ఎందుకంటే..

సాధారణంగా దేశంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలం విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఆ రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. కానీ చట్టరీత్యా దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ స్థలాల విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కేంద్రానికే ఉంటుంది. అందుకే స్థలం కేటాయింపు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశానన్ని అర్వింద్ కేజ్రీవాల్ చెప్పారు.  

Tags:    

Similar News