చరిత్ర గర్భంలో కలిసిపోయిన 2020.. గడిచిన కాలమంతా ఓ జ్ఞాపకం..

Update: 2021-01-01 06:24 GMT

కరోనా.. లాక్‌డౌన్‌.. అన్‌లాక్‌.. ఇలా చూస్తుండగానే 2020 గడిచిపోయింది. జనజీవనాన్ని అతలాకుతలం చేసి ఎంతో విషాదం మిగిల్చిన 2020 కాలగర్భంలో కలిసిపోయింది. అటు కోటి ఆశలతో నూతన సంవత్సరం 2021 రానేవచ్చింది.

2020వ ఏడాది చరిత్ర గర్భంలో కలిసిపోయింది. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు.. సంతోషాలు బాధలను మిగిల్చి సెలవంటూ చరిత్ర పుటల్లోకి వెళ్లిపోయింది. ఏదిఏమైనా గడిచిన కాలమంతా జ్ఞాపకమే. ఎందుకంటే కొందరికి తీపి గుర్తులను మిగిల్చితే, మరికొందరికి అనుభవాలు, వెలకట్టలేని గుణపాఠాలను నేర్పింది. 2020 కూడా సర్వజనులకు ఇదే చెప్పి ఇక సెలవంటూ వెళ్లిపోయింది.

కాలచక్రం గిర్రున తిరిగింది. అయితే కాలం అందరికీ ఎప్పుడు ఒకే అనుభూతులను ఇవ్వదు. ఒకరికి చేదునిస్తే మరొకరికి తీపినిస్తుంది. చెప్పాలంటే 2020వ ఏడాది ఎక్కవ మందికి కష్టాన్నే ఇచ్చింది. ఇక 2020లాగా 2021వ ఏడాది ఉండకూడదంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అందరూ కొత్త ఏడాది శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పాతేడాదికి ముగింపు పలుకుతూ కొత్త ఏడాదికి సాదరంగా స్వాగతం పలికారు.

కొత్తఏడాదిలో సాధించాల్సిన, ఆచరించాల్సిన వాటిపై ప్రతీది ప్లాన్‌ చేసుకుంటూ జీవితం బంగారుమయం కావాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. తాము ఎలా ఉండాలి ఎలా ఉండకూడదోనని ప్రణాళికలు రచించుకుంటారు. కొత్త ఏడాదిలో ఆనందంగా ఉండాలని, హాయిగా గడపాలని కోరుకుంటారు. మంచిమార్గంలో పయనించాలని ప్రయత్నానికి శ్రీకారం చుడుతుంటారు. అయితే అనుకున్నవన్నీ సాధ్యంకాకపోవచ్చు. కానీ కొత్త సంవత్సరం మాత్రం ప్రయత్నాన్ని కొనసాగించాలని అలాంటి వారందరికీ ఆల్‌ ద బెస్ట్‌ చెబుతోంది హెచ్‌ఎంటీవీ.

Tags:    

Similar News