కేరళ అసెంబ్లీ సెషన్స్ లో హై డ్రామా 'గో బ్యాక్ గవర్నర్' అంటూ నినాదాలు

కేరళ అసెంబ్లీలో గవర్నర్ పై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.

Update: 2020-01-29 05:12 GMT

కేరళ అసెంబ్లీలో గవర్నర్ పై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. బడ్జెట్ సమావేశంలో ప్రసంగించడానికి గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ బుధవారం ఉదయం సభకు వచ్చిన వెంటనే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు "గో బ్యాక్ గవర్నర్ " అని నినాదాలు చేస్తూ, సిఎఎ వ్యతిరేక పోస్టర్లను ప్రదర్శించడంతో కేరళ అసెంబ్లీ బుధవారం హై వోల్టేజ్ డ్రామా నెలకొన్నట్టయింది. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ( యుడిఎఫ్ ) ఎమ్మెల్యేలు గవర్నర్ మార్గాన్ని చుట్టు ముట్టారు. ప్లకార్డులు పట్టుకొని సభలోకి రాకుండా నినాదాలు చేస్తూ వ్యతిరేకించారు. దాంతో హౌస్ మార్షల్స్ , గవర్నర్ ఎస్కార్ట్ పోడియం వరకు రావలసి వచ్చింది.

గవర్నర్ ఖాన్ సభకు వచ్చే సమయంలో యుడిఎఫ్ ఎమ్మెల్యేలు అడ్డుకోవడంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్.. ఖాన్‌ను సభలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పదేపదే ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష సభ్యులను ఆందోళన విరమించాలని సీఎం, స్పీకర్ ప్రయత్నించినప్పటికీ వారు లెక్కచేయకుండా.. గవర్నర్ ఖాన్ మరియు సిఎఎకు మద్దతుగా ఆయన వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. దాదాపు 10 నిమిషాల నిరసన తరువాత ప్రతిపక్ష సభ్యులను బలవంతంగా పక్కకు తప్పించి గవర్నర్ వెళ్ళే మార్గాన్ని క్లియర్ చేశారు మార్షల్స్ . మార్షల్స్‌ తన కుర్చీ వద్దకు తీసుకెళ్లిన తర్వాతే గవర్నర్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే గవర్నర్ తన ప్రసంగం ప్రారంభించిన వెంటనే పలువురు ఎమ్మెల్యేలు నిరసనగా వాకౌట్ చేశారు.

రాష్ట్ర అసెంబ్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) , నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) కు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నిరసన చేపడుతున్నారు. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్.. ప్రధాని నరేంద్ర మోడీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ , కేరళ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాలా సోమవారం ఆరోపించిన సంగతి తెలిసిందే. గవర్నర్ రాష్ట్ర అసెంబ్లీ గౌరవానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

Tags:    

Similar News