హోరు వానలో మునిగిన బెంగళూరు

Heavy rain in Bangalore: బెంగళూరు లో భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు ప్రాంతాలు నీట మునిగాయి.

Update: 2020-10-24 02:26 GMT

నగరాల మీద వర్షం విరుచుకుపడుతోంది. హైదరాబాద్ లో ఈ మధ్య వర్ష బీభత్సాన్ని ఇంకా మర్చిపోలేదు. ఆ దెబ్బతో కుదేలైన జనజీవనం ఇంకా కుదుట పడనేలేదు. మరో నగరం భారీ వర్షం ధాటికి మునిగిపోయింది. బెంగళూరు నగరంలో నిన్న (అక్టోబర్ 23) మధ్యాహ్నం నుంచి కురిసిన వర్షానికి నగరం చిగురుటాకులా వణికిపోయింది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి చిన్నగా మొదలైన వాన కుండపోతగా మారింది. దాదాపు రెండు గంటలపాటు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు కురుస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీళ్ళలో మునిగిపోయాయి. రోడ్లు ఏరుల్లా మారిపోయాయి.

ముఖ్యంగా బెంగళూరు దక్షిణ ప్రాంతంలో పలుప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. వాహనాలు నీటిలో చిక్కుకుపోయాయి. అక్కడక్కడా కార్లు కొట్టుకుపోయాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మైసూరు రోడ్డు, సిల్క్ బోర్డు జంక్షన్, హోసూర్ రోడ్, బన్నెర్‌ఘట్ట రోడ్, బసవనగుడి తదితర కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ గంటల తరబడి స్తంభించిపోయింది.

బెంగళూరు నగర పాలక సంస్థ సిబ్బంది, నగర పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాలనీలలో నీట మునిగిన ప్రాంతాల్లో బోట్ల సాయంతో ప్రజలను బయటకు తీసుకొచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టారు.

బెంగళూరులో శుక్రవారం 13.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. హాల్ ఎయిర్‌పోర్టు ప్రాంతంలో 1.3 మి.మీ. వర్షపాతం రికార్డవగా.. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంతంలో 7.7 మి.మీ వర్షపాతం కురిసినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 



Tags:    

Similar News