Guntur Jawan: ఉగ్రపోరులో గుంటూరు జిల్లాకి చెందిన జవాన్ వీరమరణం
Guntur Jawan Killed by Terrorist: జమ్ముకశ్మీర్ లో జరుగుతున్న ఉగ్రపోరులో మరో తెలుగు బిడ్డ జశ్వంత్ రెడ్డి వీరమరణం పొందారు.
Jawan Jashwant Reddy
Guntur Jawan Killed by Terrorist: నియంత్రణ రేఖ వెండబడి జరుగుతున్న ఉగ్రపోరులో మరో తెలుగు బిడ్డ వీరమరణం పొందారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. వీరిలో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన సైనికుడు మనుప్రోలు జశ్వంత్ రెడ్డి(23) వీరమరణం పొందారు. ఈ మేరకు పట్టణంలోని దరివాద కొత్తపాలెంలోని తల్లిదండ్రులకు శుక్రవారం తెల్లవారుజామున ఆర్మీ అధికారులు సమాచారం అందించారు.
జశ్వంత్ 2016లో మద్రాసు రెజిమెంట్ లో సైన్యంలో చేరారు. తొలుత నీలగిరిలో పనిచేసిన ఈయన ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్నారు. నాలుగు నెలల క్రితం సెలవులకు ఇంటికి వచ్చి వెళ్లారు. మరో నెల రోజుల్లో అతనికి వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో ఉగ్రవాదుల కాల్పుల్లో కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు వెంకటేశ్వరమ్మ శ్రీనివాసరెడ్డి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహం శుక్రవారం రాత్రికి బాపట్ల చేరుకోవచ్చని అధికారుల నుంచి సమాచారం అందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టు పెట్టగా ముష్కరుల కాల్పుల్లో ఇద్దరు జావన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.
రాజౌరి జిల్లా సుందర్‌బని సెక్టార్ దాదల్ వద్ద ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టు నిఘా వర్గాల ద్వారా జూన్ 29న సమాచారం అందుకున్న సైన్యం తనిఖీలు నిర్వహించిందని వెల్లడించారు. తదనంతరం, జులై 8న కూడా ఇటువంటి సమాచారం రావడంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన సైన్యం. దాదల్ అడవిలో ఉగ్రవాదులను గుర్తించింది. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పుల జరపడంతో సైన్యం అప్రమత్తమయ్యి ఎదురుకాల్పులు ప్రారంభించిన విషయం తెలిసిందే.