Gali Janardhan Reddy: బళ్లారిలో టెన్షన్.. గాలి జనార్దన్ రెడ్డి భవనానికి నిప్పు
Gali Janardhan Reddy: కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనం రేపుతూ బీజేపీ ఎమ్మెల్యే, మైనింగ్ దిగ్గజం గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓ విలాసవంతమైన భవనాన్ని దుండగులు తగలబెట్టారు.
Gali Janardhan Reddy: కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనం రేపుతూ బీజేపీ ఎమ్మెల్యే, మైనింగ్ దిగ్గజం గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓ విలాసవంతమైన భవనాన్ని దుండగులు తగలబెట్టారు. బళ్లారి కంటోన్మెంట్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ప్రమాద సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినప్పటికీ, భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
పథకం ప్రకారమే దాడులు?
బళ్లారి నగరంలోని 'జీ స్క్వేర్ లేఅవుట్'లో సుమారు రూ. 3 కోట్ల విలువైన ఈ మోడల్ హౌస్‌పై దుండగులు పెట్రోల్, డీజిల్ పోసి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరుల పనేనని ఆయన ఆరోపించారు. ఈ నెల 1వ తేదీన జరిగిన కాల్పుల ఘటన మరువక ముందే, ఇప్పుడు ఏకంగా భవనాన్ని తగలబెట్టడం రాజకీయ కక్ష సాధింపేనని సోమశేఖర రెడ్డి ధ్వజమెత్తారు.
గాలి జనార్దన్ రెడ్డి స్పందన:
ప్రస్తుతం బెంగళూరులో అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల బ్యానర్ల వివాదం తలెత్తిన నేపథ్యంలోనే ఈ అగ్నిప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. "బళ్లారి ఎస్పీతో మాట్లాడాను, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరాను" అని ఆయన మీడియాకు తెలిపారు.
ఒకరి అరెస్ట్.. పోలీసుల దర్యాప్తు:
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామంతో బళ్లారిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.