మధ్యప్రదేశ్‌ ధార్‌ జిల్లాలో ఘోర ప్రమాదం

Madhya Pradesh: ఖాల్‌ఘాట్‌ దగ్గర అదుపుతప్పి నదిలో పడిన బస్సు

Update: 2022-07-18 06:28 GMT

మధ్యప్రదేశ్‌ ధార్‌ జిల్లాలో ఘోర ప్రమాదం

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌ ధార్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఖాల్‌ఘాట్‌ దగ్గర అదుపుతప్పి ఓ బస్సు నదిలో పడింది. ఈ ఘటనలో ఐదు మృతదేహాలను వెలికితీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇండోర్‌ నుంచి పుణె వెళ్తుండగా ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 51 మంది ప్రయాణీకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

 ప్రమాద విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలానికి చేరుకొని 15 మంది ప్రాణాలు కాపాడారు. మిగతావారి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఖాల్ ఘాట్ నది వద్దకు రాగానే బస్సు సంజయ్ వంతెనపై అదుపు తప్పిందని అధికారులు చెప్పారు. వంతెన రెయిలింగ్ ను ఢీకొట్టిన బస్సు... 20 అడుగుల ఎత్తు నుంచి నదిలో పడిపోయింది. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థంగాక ప్రయాణీకులు భీతిల్లిపోయారు. తేరుకునే లోపే బస్సు నది నీటిలో మునిగిపోయింది. ప్రాణాలు కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొందరు బస్సులోనే జలసమాధి అయ్యారు.

బస్సుల నదిలో పడిపోవడం గమనించిన వాహనదారులు అధికారులకు సమాచారం చేరవేశారు. కొందరు నది ఒడ్డుకు చేరుకొని ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేశారు. భారీ క్రేన్ ను తెప్పించిన అధికారులు బస్సును నదిలోంచి బయటకు తీశారు. కొందరిని కాపాడారు. గల్లంతైన వారికోసం గాలింపు చేపట్టారు.

Tags:    

Similar News