Farmers Protest: కేంద్రంతో రైతు సంఘాల చర్చలు విఫలం..
Farmers Protest: ప్రతిపాదనలను తిరస్కరించిన రైతుసంఘాలు
Farmers Protest: కేంద్రంతో రైతు సంఘాల చర్చలు విఫలం..
Farmers Protest: పంటకు కనీస మద్దతు ధర కోరుతూ ఛలో ఢిల్లీ చేపట్టిన రైతులు కేంద్రం ప్రతిపాదనలను తిరస్కరించినట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తమతో చర్చించిన విషయాలు, మీడియాకు చెప్పిన వివరాల్లో చాలా డిఫరెన్స్ ఉందని రైతు సంఘం నాయకులు తెలిపారు. మీటింగ్‌లో అన్ని పంటలను కొనుగోలు చేస్తామని చెప్పారని అన్నారు రైతులు. అయితే పప్పు దినుసులపై కనీస మద్దతు ధర కోసం 1.5 లక్షల కోట్లు రూపాయలు ఖర్చు చేస్తున్నామని కేంద్రమంత్రులు తమతో చెప్పారని అన్నారు. అయితే వ్యవసాయ నిపుణులు మాత్రం 1.75 లక్షల కోట్లు వరకు ఖర్చు చేయొచ్చని అంటున్నట్లు రైతులు తెలిపారు. అందువల్లనే కేంద్రం తీసుకొచ్చిన ప్రతిపాదనను తిరస్కరించినట్లు స్పష్టం చేశారు. కాగా రేపు ఢిల్లీలో శాంతియుత ర్యాలీ చేపట్టేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరారు రైతులు.
రైతు సంఘాలతో సుదీర్ఘ సమయం చర్చలు జరిపిన కేంద్ర మంత్రులు వారి ముందు కీలక ప్రతిపాదనలు ఉంచారు. ఇందులో భాగంగా రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని మంత్రుల బృందం ప్రతిపాదించింది. ప్రభుత్వ ప్రతిపాదనలపై అన్ని రైతు సంఘాలతో చర్చించి, నిపుణుల అభిప్రాయాలు తీసుకొని ఒక నిర్ణయానికి వస్తామని రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనలో స్పష్టత లేదని.. కేవలం పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలకే కాకుండా మొత్తం 23 పంటలకు కూడా కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతున్నామని రైతు నాయకులు తెలిపారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.
కందులు, మినుములు, మైసూర్ పప్పు, మొక్కజొన్న పండించే సాగుదారులతో ఎన్‌సీసీఎఫ్, ఎన్‌ఏఎఫ్‌ఈడీ వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఓ ప్రకటనలో తెలిపారు. కొనుగోలు చేసే పరిమాణంపై ఎటువంటి పరిమితి ఉండదని స్పష్టం చేవారు. అయితే దీనికోసం ఒక పోర్టల్ కూడా అభివృద్ధి చేస్తామన్నారు. తమ ప్రతిపాదనల వల్ల పంజాబ్‌లో వ్యవసాయానికి సెక్యూరిటీ లభిస్తుందని తెలిపారు. భూగర్భ జలాలు మెరుగవుతాయని.. సాగు భూములు నిస్సారంగా మారకుండా ఉంటాయని చెప్పారు. కాగా ఇప్పటివరకు రైతు సంఘాలతో కేంద్రం నాలుగు దఫాలు చర్చలు జరిపింది.
మరోవైపు తాము లేవనెత్తిన డిమాండ్లను నెరవేర్చాలని లేదా ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అనుమతించాలని రైతు నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పంజాబ్-హర్యానా సరిహద్దును దాటేందుకు ప్రయత్నించిన 400 మంది రైతులు..పోలీసుల దాడిలో గాయపడ్డారని నేతలు తెలిపారు. పెల్లెట్ గన్‌లు వాడలేదంటూ హర్యానా డీజీపీ చేసిన ప్రకటన అవాస్తవమని రైతు నాయకులు అన్నారు. రైతులకు జరిగిన గాయాలపై సుప్రీంకోర్టు సుమోటోగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫిబ్రవరి 20 అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్ నిషేధం విధించడంపై రైతులు పంజాబ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జరిగిందా అని ప్రశ్నించారు.