Delhi: ఢిల్లీలో నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం పొడిగింపు

Delhi: తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమలులో ఉండనున్న నిషేధం

Update: 2021-11-30 02:28 GMT

ఢిల్లీలో నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం పొడిగింపు (ఫైల్ ఇమేజ్)

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నిర్మాణాలు, కూల్చివేతల కార్యకలాపాలపై నిషేధాన్ని ప్రభుత్వం పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నిషేధం అమలులో ఉంటుందని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ తెలిపారు. ట్రక్కుల ప్రవేశంపై నిషేధం, అవసరమైన వాటిని మినహాయించి డిసెంబర్‌ 7 వరకు కొనసాగుతుందని, CNG, ఎలక్ట్రికల్‌ ట్రక్కులు ఢిల్లీలో ప్రవేశానికి అనుమతించనున్నట్లు మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో ఢిల్లీ గాలి నాణ్యత చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వాతావరణ శాఖ అంచనా వేసినట్లుగా వర్షాలు కురిస్తే పరిస్థితి మెరుగుపడుతుందని మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఢిల్లీలో నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధాన్ని పొడగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్లంబింగ్‌ వర్క్‌, ఇంటీరియర్‌ డెకరేషన్‌, ఎలక్ట్రిక్‌ వర్క్‌, కార్పెంటరీ కాలుష్య రహిత నిర్మాణ కార్యకలాపాలకు ఇప్పటికే అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన 'రెడ్‌లైట్‌ ఆన్‌ – గాడి ఆఫ్‌' కార్యక్రమాన్ని డిసెంబర్‌ 18 వరకు పొడగిస్తున్నట్లు మంత్రి చెప్పారు.

మరోవైపు ఢిల్లీ, జాతీయ రాజధాని పరిధి NPRలోకి వచ్చే రాష్ర్టాల్లో కాలుష్య నివారణకు గాలి నాణ్యత నిర్వహణ కమిషన్‌ చేసిన మార్గదర్శకాలకు ఏ మేర కట్టుబడి ఉన్నారన్నదానిపై స్పందన తెలుపాలని ఢిల్లీ, NPR రాష్ర్టాలు, కేంద్రప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సెంట్రల్‌ విస్టా సహా తమ పరిధిలోని నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. NPR పరిధిలో కాలుష్య నివారణకు గాలి నాణ్యత కమిషన్‌ గతంలో మార్గదర్శకాలు జారీచేసింది. వీటి అమలుకు రాష్ర్టాలు ఏం చర్యలు తీసుకొన్నాయో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 

Tags:    

Similar News