Gangsters Marriage: ఢిల్లీలో గ్యాంగ్‌స్టర్ పెళ్లిపై ఉత్కంఠ... శత్రు దుర్భేద్యంగా కల్యాణ మండపం
Gangsters Marriage: గతంలో ఓసారి పోలీసుల నుండి తప్పించుకున్న గ్యాంగ్‌స్టర్ సందీప్
Gangsters Marriage: ఢిల్లీలో గ్యాంగ్‌స్టర్ పెళ్లిపై ఉత్కంఠ... శత్రు దుర్భేద్యంగా కల్యాణ మండపం
Gangsters Marriage: డ్రోన్లు, సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు, సాయుధ బలగాల మోహరింపుతో ఢిల్లీలోని ఓ కళ్యాణ మండపం శత్రుదుర్భేద్యంగా మారింది. పోలీసులు చేసిన ఈ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చూశాక..విదేశీ అతిథో లేక ప్రముఖుల వేడుకకో అనుకుంటే పొరపాటే. ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల వివాహానికి వేదిక కానున్న ఫంక్షన్‌హాల్ దగ్గర పరిస్థితి ఇది. తీహార్ జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ సందీప్, బెయిల్‌పై ఉన్న ఓ మహిళా క్రిమినల్‌కు వివాహం నేపథ్యంలో గ్యాంగ్‌వార్ జరిగే అవకాశం ఉండటం, కస్టడీ నుంచి నిందితుడు తప్పించుకోవడం వంటి ఘటనలకు తావివ్వకుండా ఢిల్లీ పోలీసులు చేసిన ఏర్పాట్లు ఇవి. ఢిల్లీలోని ద్వారకా సెక్టార్-3లో ఉన్న సంతోష్‌గార్డెన్‌లో ఈ వివాహం జరగనుంది. సందీప్ తరఫు న్యాయవాది 51వేలు చెల్లించి వేదికను బుక్ చేశాడు.
పోలీసులు ఎన్నో సాహసాలు చేసి, కరుడ గట్టిన నేరస్తులను పట్టుకోవడం చూసుంటాం. వారిని కోర్టులో హాజరు పరిచి సరైన శిక్ష పడేలా సైతం పోలీసులు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా జరగడం లేదు. ఏకంగా ఇద్దరు నేరస్తులకు పోలీసులే పహారా కాస్తున్నారు. ఇద్దరు నేరస్తులు పెళ్లి చేసుకుంటే ఇక వారికి భారీ ఎత్తున పోలీసులు పహారా కాస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా...ఢిల్లీలోని ఇద్దరు గ్యాంగ్ స్టర్స్ పెళ్లి వేడుక సమయంలో ఇదే జరుగుతోంది. ఢిల్లీలోని ఓ హోటల్లో గ్యాంగ్ స్టర్స్ అనురాధ, సందీప్ పెళ్లి చేసుకోబోతున్నారు.
సందీప్ గతంలో ఓ సారి హరియాణా పోలీసుల నుంచి తప్పించుకోవడంతో పాటు బలగాలపై దాడి చేయించాడు. దీంతో మరోసారి అటువంటి ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. హోటల్ ప్రవేశమార్గాల్లో మెటల్ డిటెక్టర్లు మొదలు..లోపలికి వచ్చే వారికి బార్‌కోడ్ బ్యాండ్లు, వాహనాలకు ప్రవేశ పాసులు మంజూరు వంటి చర్యలు చేపట్టారు. అరడజను సీసీ కెమెరాలు, డ్రోన్లతో అక్కడి కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు.
హరియాణాకు చెందిన సందీప్ అలియాస్ కాలా జథేడీ, రాజస్థాన్‌కు చెందిన అనురాధా చౌధరి అలియాస్ మేడమ్ మింజ్‌లు అనేక కేసుల్లో నిందితులు. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఈరోజు వివాహం చేసుకోనున్నారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు సందీప్ అత్యంత సన్నిహితుడు. ఇతడిపై దోపిడీ, హత్య, హత్యాయత్నం వంటి పదికి పైగా కేసులున్నాయి. గ్యాంగ్‌స్టర్ ఆనంద్‌పాల్ సింగ్ వద్ద పనిచేసిన అనురాధా చౌధరిపై హిస్టరీ షీట్ ఉంది. ఆమె ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉండగా.. తిహాడ్ జైల్లో ఉన్న సందీప్ పెళ్లి కోసం న్యాయస్థానం ఆరు గంటలు పెరోల్ ఇచ్చింది.