ఢిల్లీలో 5 ఏళ్ల క్రితంతో పోల్చుకుంటే ఈ ఎన్నికల ఫలితాల్లో ఏం మారింది?

Update: 2025-02-08 14:43 GMT

Delhi Assembly elections results 2025: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు

Delhi Polls results 2025: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపి ఘన విజయం సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపి 48 స్థానాలు గెలుచుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 స్థానాలు వస్తే బీజేపికి కేవలం 8 సీట్లే వచ్చాయి. కానీ ఈసారి బీజేపి బలం పెంచుకుంది. అదనంగా మరో 40 సీట్లలో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది.

ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే... 2020 నాటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఒక్క సీటు గెల్చుకోలేదు. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సింగిల్ రన్ కూడా తీయకుండానే డకౌట్ అయింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు హ్యాట్రిక్ విజయం సాధించిన ఆ పార్టీ ఇప్పుడు హ్యాట్రిక్ ఓటమికి మరో అడుగు దూరంలో ఉంది.

ఈ ఐదేళ్లలో ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేతలుగా పేరున్న, అలాగే ఢిల్లీకి చివరి ఇద్దరు ముఖ్యమంత్రులైన కేజ్రీవాల్, అతిషి కెరీర్ గ్రాఫ్ ఎలా ఉందో కూడా ఇప్పుడు చూద్దాం.

ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూ ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, బీజేపి నేత పర్వేష్ సింగ్ సాహిబ్ చేతిలో 3,182 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2020 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ బీజేపి అభ్యర్థి సునీల్ యాదవ్‌ను 21,000 ఓట్ల మెజారిటీతో ఓడించారు.

ఢిల్లీ సీఎం అతిషి మార్లెనా కల్కాజీ నియోజకవర్గం నుండి తన సమీప ప్రత్యర్థి, బీజేపి నేత రమేశ్ బిధురిపై 3500 ఓట్ల తేడాతో గెలుపొందారు. గత ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన అతిషి, బీజేపి నేత ధర్మవీర్ సింగ్‌పై 11,000 ఓట్ల తేడాతో గెలిచారు. 

Tags:    

Similar News