Coronavirus : వుహాన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న 324 మంది భారతీయులు.. అందులో ఏపీ వాళ్ళు..
కరోనా వైరస్‌పై భారత్ సీరియస్ గా ద్రుష్టి సారించిన సంగతి తెలిసిందే. చైనాలో కరోనా వైరస్ కు నిలయంగా మారిన వుహాన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వుహాన్ సిటీకి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాన్ని పంపి.. మొదటి విడతలో 324 మందిని ఢిల్లీకి తీసుకువచ్చారు. వచ్చిన వారిలో ఏపీకి చెందిన 56 మంది ఇంజనీర్లు, తెలంగాణకు చెందిన ఐదుగురు వ్యక్తులు ఉన్నట్టు సమాచారం. వారికి ఢిల్లీ విమానాశ్రయంలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు..
అనంతరం వారిని మనేసర్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్లలో తరలించారు.. అక్కడే వారిని దాదాపు 20 అబ్జర్వేషన్‌లో ఉంచుతారు. వీరిలో ఎవరికైనా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయినట్లయితే వెంటనే వారిని కంటోన్మెంట్ బేస్ హాస్పిటల్‌లోని ఐసోలేషన్ వార్డుకు తరలిస్తారు. కాగా వూహాన్ నుంచి భారతీయులను తరలించడానికి రెండు ఎయిర్ ఇండియా విమానాలను ఏర్పాటు చేసింది. ఇందులో ఒక్కోదానిలో నిపుణులైన ఐదుగురు వైద్యుల బృందం పనిచేస్తోంది. వీరు ఇన్‌ఫెక్షన్‌ను అడ్డుకునేందుకు ప్రయాణంలో కొన్ని జాగ్రత్తలు ప్రయాణికులకు చెప్పారు.
అంతేకాదు విమానంలో ఎటువంటి తినుబండారాలను అనుదుబాటులో ఉంచలేదు.. కేవలం సీ ప్యాకెట్ల రూపంలో ఆహారం అందుబాటులో ఉంచారు. ప్రయాణికుల ఎవరు కూడా ఒకరికొకరు మాట్లాడుకోకుండా చర్యలు తీసుకున్నారు.. మాస్క్‌లను ఎటువంటి పరిస్థితుల్లోనూ తీయకుండా జాగ్రత్త పడ్డారు. కాగా వూహాన్‌లో మిగిలిపోయిన మరికొంత మంది భారతీయులను ఇవాళ తీసుకొస్తారని సమాచారం తెలిసింది.
ఇదిలావుంటే చైనాలో కరోనావైరస్ ధాటికి ఇప్పటివరకూ 259 మంది మరణించినట్టు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. మరణించిన వారి సంఖ్య 259 కు పెరిగిందని.. అంతేకాదు ధృవీకరించబడిన అంటువ్యాధుల సంఖ్య దాదాపు 12,000 కు పెరిగిందని ఫిబ్రవరి 1న చైనా ప్రభుత్వం తెలిపింది. జాతీయ ఆరోగ్య కమిషన్ తన రోజువారీ వివరాల ఆధారంగా మరో 46 మంది శ్వాసకోశ వ్యాధి బారిన పడ్డారని చెప్పింది. ఈ మరణాలలో ఒకటి మినహా మిగిలినవి కరోనావైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉన్న హుబీ ప్రావిన్స్‌లో సంభవించినట్టు వెల్లడించింది.