Corona Effect: ఓ పక్క కరోనా.. మరోపక్క పెరుగుతున్న నిత్యవసర ధరలు

Corona Effect: ప్రతిరోజూ పెరుగుతున్న డీజిల్‌, పెట్రోల్‌, కూరగాయల రేట్లు పప్పు ధాన్యాలు, ఆయిల్‌ ధరలు పైపైకి

Update: 2021-07-18 12:56 GMT

Representational Image

Corona Effect: పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, కూరగాయలు ఇలా అన్ని నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్యుల జీవనం మరింత భారమవుతోంది. ఓ వైపు కోవిడ్‌తో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే ఇప్పుడు పెరుగుతున్న ధరలు.. సామాన్యుడిని కోలుకోకుండా చేస్తున్నాయి. దీంతో వంటింటి బడ్జెట్‌ తారుమారవుతోంది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర నూట నాలుగు రూపాయల 86 పైసలు కాగా డీజిల్‌ ధర 97 రూపాయల 96 పైసలకు చేరుకుంది. ఈ పెరిగిన ధరల ప్రభావం ఇప్పుడు నిత్యవసరాలైన కూరగాయలు, పప్పు ధాన్యాలపై పడింది.

నిత్యవసర ధరలు భారీగా పెరుగుతుండటంతో సామాన్యుడి సెలసరి ఆదాయం చేతికందకుండానే ఆవిరవుతోంది. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయాలు నగరానికి దిగుమతి జరుగుతుంటుంది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడటంతో పంటలు దిగుమతి బాగా పెరిగింది. అయితే.. పెట్రోల్, డీజిల్ చార్జీలు పెరగడంతో ట్రాన్స్‌పోర్ట్ ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇప్పుడు వాటి భారం నిత్యావసర వస్తువులపై పడటంతో సామాన్య వినియోగదారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. హోల్‌సేల్‌ మార్కెట్‌లో టమాటా ధర కిలో 20 రూపాయలు ఉంటే.. రిటైల్ మార్కెట్‌లో 30 రూపాయలు పలుకుతోంది. అదే విధంగా పచ్చిమిర్చి కిలో 45 ఉండగా, రిటైల్ మార్కెట్లో 60 రూపాయల వరకు ఉంటుంది.

మరోవైపు.. పప్పు ధాన్యాలు, వంటనూనెల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. నిన్న, మొన్నటిదాకా కరోనా కారణంగా వేతనాల్లో కోత విధించడంతో తాము అనేక ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడిప్పుడే పరిస్థితులు సామాన్య స్థితికి చేరుకుంటున్నాయని అనుకునేలోపే.. నిత్యవసర ధరలు జీతాన్ని ఆవిరి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో జీవనం కష్టసాధ్యంగా మారిందని వాపోతున్నారు. ప్రభుత్వాలు తక్షణమే ధరలు తగ్గించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Tags:    

Similar News