Congress: పంజాబ్ రాజకీయాలలో కాంగ్రెస్ మూడు ముక్కలాట

Punjab Election Results 2022: పిల్లిపోరు.. పిల్లిపోరు..పిట్ట తీర్చిందన్నట్లుగా అయ్యింది పంజాబ్ లో కాంగ్రెస్ పరిస్థితి.

Update: 2022-03-10 15:30 GMT

Congress: పంజాబ్ రాజకీయాలలో కాంగ్రెస్ మూడు ముక్కలాట

Punjab Election Results 2022: పిల్లిపోరు.. పిల్లిపోరు..పిట్ట తీర్చిందన్నట్లుగా అయ్యింది పంజాబ్ లో కాంగ్రెస్ పరిస్థితి.. ఒకప్పుడు కాంగ్రెస్ కు అడ్డాగా చెప్పుకునే పంజాబ్ కెప్టెన్, సిద్దూల అంతర్గత కలహాలతో ఆప్ ఖాతాలోకి చేజారిపోయిందా?. పంజాబ్ లో పార్టీ పరాజయానికి కారణాలేంటి? కెప్టెన్ ఓటమికి దారి తీసిన పరిస్థితులేంటి?

కలసి ఉంటే కలదు సుఖం. కాంగ్రెస్ పార్టీకి పంజాబ్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన సందేశం ఇదే.. కాంగ్రెస్ కు,సోనియా కు కెప్టెన్ అమరీందర్ సింగ్ కు అందరికీ పంజాబ్ ఎన్నికలు పెద్ద గుణపాఠం నేర్పాయి. పీసీసీ చీఫ్ గా సిద్ధు పార్టీకి శల్య సారధ్యం చేశాడన్నది జగమెరిగిన సత్యం. సిద్దు వ్యవహార శైలితో అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు అమరీందర్ కు కూడా కోలుకోలేని దెబ్బ తగిలింది. సిద్దును పీసీసీ చీఫ్ చేసిన నాటినుంచి పంజాబ్ కాంగ్రెస్ లో లుకలుకలు పెరిగిపోయాయి. అమరీందర్ తో సన్నిహితంగా ఉంటూనే చేయాల్సిన నష్టం చేసేశాడు నవజోత్ సిద్దు. పార్టీలో అమరీందర్ కు అంతర్గత ఇబ్బందులు సృష్టించడం క్షణానికో మాట మాట్లాడుతూ కన్ఫ్యూజన్ తో కెప్టెన్ ను కార్నర్ చేశాడు. పొమ్మన లేక పొగ పెట్టాడు సిద్దూ వ్యవహార శైలితో కెప్టెన్ అనేక మార్లు పార్టీకి గుడ్ బై కొడతానంటూ బెదిరింపులకూ దిగాడు వ్యవహారం సోనియా పంచాయతీ దాకా వెళ్లింది. కానీ రాహుల్,ప్రియాంకల మద్దతుతో అమరీందర్ ను ఒంటరిని చేయగలిగాడు నవజోత్ సిద్దు.

దేశ భద్రత గురించి, సరిహద్దుల గురించి అమరీందర్ చేసిన కామెంట్లు ఆయనకు వ్యక్తిగత నష్టాన్ని కలిగించాయి. పంజాబ్, పాకిస్థాన్ మధ్య కర్తార్పూర్ సాహెబ్ కారిడార్ రాకపోకలని ఆయన తప్పుబట్టాడు అది దేశ భద్రతకు ముప్పు అని కామెంట్ చేయడం పంజాబీలకే నచ్చలేదు.

కాంగ్రెస్ పార్టీలో అమరీందర్ ది ప్రత్యేక స్థానం. ఆపరేషన్ బ్లూ స్టార్ తదనంతర పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీకి దూరమైన అమరీందర్ శిరోమణి అకాలీదళ్ పార్టీలో చేరి మంత్రి పదవి సాధించారు. ఆ తర్వాత సిక్కు నేతగా ఎదిగారు. ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత కాంగ్రెస్ కు పంజాబీలు దూరమైనా వారందరూ తిరిగి పార్టీ వైపు వచ్చేలా చేసిన ఘనత అమరీందర్ దే. 2017 ఎన్నికల్లో గెలిచి పంజాబ్ కు తిరుగులేని నేతగా ఎదిగినా., సిద్దూ రాకతో అమరీందర్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

సిద్దూ వర్గం ఆధిపత్యం భరించలేక పార్టీకి గుడ్ బై కొట్టేసిన అమరీందర్ ఎన్నికల ముందు కొత్త పార్టీ పెట్టడం వ్యూహాత్మక తప్పిదమే.. తన బలాన్ని తాను ఎక్కువగా అంచనా వేసుకున్నారు కెప్టెన్...తన పార్టీని బీజేపీకి మిత్రపక్షంగా ప్రకటించుకున్నారు. తన గెలుపు కన్నా కాంగ్రెస్ పతనమే లక్ష్యంగా పనిచేశారు. తనకు ఓటేయమనడంకన్నా కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయకూడదో ఎక్కువగా ప్రచారం చేశారు.

వీటన్నింటికీ తోడు దేశవ్యాప్తంగా ఊపందుకున్న రైతు దీక్షలు కూడా పంజాబ్ రాజకీయాలను ప్రభావితం చేశాయి. దేశ వ్యాప్త రైతు ఉద్యమానికి నాయకత్వం వహించిన రైతులంతా పంజాబ్ వారే రాజధాని నడిబొడ్డున 8 నెలల పాటూ పంజాబ్ రైతులు చేసిన పోరాటం పంజాబీయులను బలంగా తాకింది. ఆ రైతులంతా తనకు అండగా నిలుస్తారన్న ఆశలూ అడియాసలే అయ్యాయి.

ఓ వైపు బీజేపి, మరోవైపు ఆప్ సాగించిన దూకుడు ప్రచారం ముందు కాంగ్రెస్ పార్టీ ప్రచారం వెలవెలబోయింది. పంజాబ్ సీఎం గురుచరణ్ చన్నీని కూడా సిద్దూ ఏకాకిని చేయడంలో సక్సెస్ అయ్యాడు. అనుక్షణం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలతో ముప్పతిప్పలు పెట్టాడు. చివరికి సీట్ల సర్దుబాటులోనూ సిద్దు, చన్నీ ల మధ్య విభేదాలే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దెబ్బలతో చతికిల పడిపోగా ఆప్ ఈ గ్యాప్ ను పూర్తిగా ఉపయోగించుకుంది. కేజ్రీవాల్ రెండేళ్లుగా పంజాబ్ పై పట్టుకోసం ఒక పద్ధతిగా రాజకీయం చేస్తూ వచ్చారు.

మొత్తం మీద పంజాబ్ ఎన్నికల ప్రయాణంలో పడవను నడిపిన నేతలంతా పడవకు తూట్లు పొడిచిన వారే సిద్దు, చన్నీ, అమరీందర్ ముగ్గురూ మూడు ముక్కలాట ఆడారు. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ ఓటమికి, ఆముగ్గురి ఓటమికీ కారణాలయ్యాయి. చివరకు ఓటమిలోనూ నవజోత్ సిద్దూ కమెడియన్ లాగే వ్యవహరించాడు. ప్రజల స్వరం, దేవుని స్వరం అంటూ ఎన్నికల ఫలితాలపై కామెంట్ చేశాడు.

Tags:    

Similar News