Cochin Shipyard: కొచ్చిన్‌ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ కొత్త రికార్డు

Cochin Shipyard: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో అన్ని పనులను... స్వయంగా చేసుకోగల వ్యవస్థ నౌకల్లో ఏర్పాటు

Update: 2022-06-29 12:45 GMT

Cochin Shipyard Delivers Electric Barges to Norway

Cochin Shipyard: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ సంస్థ చారిత్ర సృష్టించింది. ఎలక్ట్రిక్‌ నౌకలను తయారుచేయడమే కాదు ఎగుమతులను కూడా ప్రారంభించింది. ప్రపంచంలోనే ఎలక్ట్రిక్‌ నౌకలను తయారుచేసే రెండో దేశంగా భారత్‌ రికార్డులకెక్కింది. ప్రస్తుతం రెండు ఎలక్ట్రిక్‌ నౌకలను నార్వేకు చెందిన అస్కో మారిటైమ్‌ ఏఎస్‌ అనే కంపెనీకి పంపింది. ఈ ఎలక్ట్రిక్‌ నౌకలు డచ్‌ దేశానికి చెందిన యాచ్‌ సర్వెంట్‌ నౌకలో నెల రోజుల పాటు ప్రయాణించి నార్వేకు చేరనున్నాయి. భారత్‌లో తయారైన రెండు నౌకలను మరో నౌకలో పంపండం ఇదే తొలిసారి. అంతేకాదు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి బోర్డుపై సిబ్బంది లేకుండా వాటంతట అవే వెళ్లేలా రూపొందించమే ఈ నౌకల ప్రత్యేకత.

భారత ప్రభుత్వ రంగ సంస్థ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌-సీఎస్‌ఎల్‌ నౌకల తయారీలో తనదైన మార్కును చూపుతోంది. భారత నౌకాదళానికి దన్నుగా నిలుస్తోంది. అంతేకాదు సీఎస్‌ల్‌ నౌకలకు విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. తాజాగా సీఎస్‌ఎల్ ప్రతిష్టాత్మకంగా గ్రీన్ ఎనర్జీ నౌకల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నార్వే ప్రభుత్వం కూడా ఓస్లో సముద్రంలో సరుకుల రావాణాకు కాలుష్య రహిత నౌకలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భారత్ ప్రభుత్వంతో 2019లో నార్వేకు చెందిన అక్సో మారియట్‌ ఏఎస్‌ అనే సంస్థ చర్చలు జరిగింది. 2020 జూలైలో సీఎస్‌ఎల్‌తో ఆక్సో మారియట్‌ ఏస్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సీఎస్‌ఎల్‌ రెండు ఎలక్ట్రిక్‌ నౌకలను నిర్మించింది.

సీఎస్‌ఎల్‌ నిర్మించిన నౌకలకు మారిస్‌, థెరిసా అనే పేర్లను పెట్టారు. 67 మీటర్ల పొడవైన ఈ నౌకలు ఆక్సో ఆధ్వర్యంలో పూర్తి స్వయం ప్రతిపత్తితో పని చేస్తాయి. వీటిలో పూర్తిగా నింపిన 16 ప్రామాణిక ఐరోపా కంటైనర్లను ఒక్కో నౌక తరలించగలదు. ఈ గ్రీన్‌ ఎనర్జీ నౌకలు మర్చెంట్ నౌకల రంగంలో కొత్త బెంచ్‌ మార్క్‌ను సృష్టించనున్నాయని సీఎస్‌ఎల్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ శివరామ్‌ నారాయణ స్వామి తెలిపారు. ఎలక్ట్రిక్ నౌకల తయారీ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడం గర్వంగా ఉందన్నారు. 2020 జూన్‌లో కోవిడ్‌ ఉధృతంగా ఉండడంతో ఈ ప్రాజెక్టు ఒప్పందం కూడా విర్చువల్‌గానే జరిగిందని స్వామి చెప్పారు. ఈ నౌకలు గంటకు 18వందల 46 కిలోవాట్ల విద్యుత్‌ను వినియోగించుకోనున్నాయని చార్జింగ్‌ కూడా వేగంగా చేసుకుంటాయని స్పష్టం చేశారు.

ఈ నౌకలు నార్వేకు చేరుకున్న తరువాత స్వతంత్రంగా పని చేస్తాయి. అంటే నౌక బోర్డుపై ఎలాంటి సిబ్బంది అక్కడ పని చేయాల్సిన అవసరం లేదు. ఈ నౌకలు పూర్తిగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో అన్ని రకాల పనులను స్వయంగా చేసుకోగల వ్యవస్థను అందులో ఏర్పాటు చేసినట్టు సీఎస్‌ఎల్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ శివరామ్‌ నారాయణ స్వామి తెలిపారు. ప్రపంచానికే ఈ నౌకలు కొత్త మార్గాన్ని సృష్టిస్తాయన్నారు. అత్యాధునిక నౌకల నిర్మాణంలో భారత్ తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటుతోందని స్వామి అన్నారు. ఈ నౌకలతో కార్బన్ ఉద్గారాలకు పూర్తి చెక్‌ పడుతుందన్నారు. వాతావరణ మార్పుల్లో భాగంగా గ్రీన్ ఎనర్జీ నౌకలకు డిమాండ్‌ కూడా పెరుగుతోందని స్వామి వివరించారు.

తాజాగా మారిస్‌, థెరిసా ఎలక్ట్రిక్‌ నౌకలను కొచ్చిన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ నార్వేకు ఎగుమతి చేసింది. డచ్‌ దేశానికి చెందిన యాక్‌ సర్వెంట్‌ కంపెనీకి చెందిన భారీ మదర్‌ నౌక కొచ్చిన్‌ తీరానికి చేరుకుంది. ఈ మదర్‌ నౌకలోకి 600 టన్నుల బరువైన నీటిని నింపి 8.9 మీటర్ల మేర సముద్రంలోకి దించారు. ఆ తరువాత మారిస్‌, థెరిసా నౌకలను ఎనిమిది గంటల పాటు శ్రమించి మదర్‌ నౌకలోకి చేర్చారు. ఆ తరువాత మదర్‌ నౌకలోని నీటిని మళ్లీ బయటకు విడుదల చేశారు. రెండ్రోజుల క్రితం మదర్‌ నౌక కొచ్చిన్‌ తీరం నుంచి నార్వేకు బయలుదేరింది. మదర్‌ నౌక నెల రోజుల పాటు ప్రయానించి నార్వో ఒస్లో జోర్డ్‌ తీరానికి చేరుకోనున్నది. ఈ నౌకల నిర్మాణంలో పాల్గొన్న ఆస్కో మారిటైమ్‌ సిబ్బంది అక్కడ వాటిని వినియోగంలోకి తీసుకురానున్నారు.

ఎలక్ట్రిక్‌ నౌకల నిర్మాణంతో సముద్ర జలాల కాలుష్యం తగ్గనున్నది. నౌకల నుంచి లీకయ్యే ఇంధనం సముద్ర జంతువుల ప్రాణాలను తీసేది. అయితే ఇప్పుడు వాటికి చెక్‌ పడనున్నది. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులకు సముద్ర జలాల కలుషితమే కారణమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రీన్‌ ఎనర్జీ నౌకలకు ప్రపంచ దేశాలు మొగ్గుచూపే అవకాశం ఉంది.

Tags:    

Similar News