వణికిస్తున్న బర్డ్ ఫ్లూ : తెలుగు రాష్ట్రాల్లో చనిపోతున్న కోళ్ళతో కలకలం

Update: 2021-01-08 15:04 GMT

కరోనా కల్లోలం నుంచి బయటపడముందుకే దేశ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. బర్డ్ ఫ్లూ భయం బెంబేలెత్తించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ , కేరళలో ఈ రకమైన ఫ్లూ బయటపడినట్టు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ తెలిపింది. వలస పక్షుల్లోనే ఎక్కువగా ఈ ఫ్లూ కనిపిస్తోందని కేంద్రం వెల్లడించింది. బర్డ్ ఫ్లూ కారణంగా దేశ వ్యాప్తంగా చికెన్ ధరలు భారీగా పడిపోయాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల మరణాలతో జనం ఆందోళన చెందుతున్నారు. ఓవైపు కరోనా కల్లోలంతో సతమతమవుతున్న ప్రజలకు బర్డ్ ఫ్లూ మరింత భయపెడుతోంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం, మల్లయపల్లి గ్రామంలో నాటుకోళ్ళు మృతి కలకలం రేపుతోంది. వింత రోగాలతో పది రోజులుగా నాటుకోళ్ళు మృతి చెందుతున్నాయని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు బర్డ్ ఫ్లూ కలవరం గ్రామస్థులను వెంటాడుతుండడంతో మరణించిన కోళ్ళను గ్రామానికి దూరంగా పూడ్చి వేస్తున్నారు. ఇప్పటికే సుమారు 200 కోళ్ళు మృతి చెందాయి. రక్తం కక్కుకుని ఒకదాని వెంట మరొకటి మృతి చెందుతుండడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెద్దపెల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఓ ఫారం లోని 35 కోళ్ళు మృత్యువాత పడడం కలకలం రేపుతోంది. మృతి చెందిన కోళ్లను స్థానికులు ఎస్సారెస్పీ కాలువలో పడి వేయడం ఆందోళనకు దారి తీసింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో బర్ద్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఈ సంఘటన అందర్నీ భయాందోళనకు గురి చేసింది. ఐతే, కోళ్లకు సకాలంలో వ్యాక్సిన్ వేయకపోవడంతో మృత్యువాత పడ్డాయని ఎక్కడ బర్ద్ ఫ్లూ లక్షణాలు లేవని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పశువైద్యాధికారి సూచించారు.

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్ గ్రామంలో 200 నాటు కోళ్లు మృతి చెందాయి. దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తిస్తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఐతే, కోళ్లను పోస్ట్ మార్టమ్ చేసిన వెటర్నరీ డాక్టర్లు కోళ్ల మరణానికి బర్డ్ ఫ్లూ కారణం కాదని తేల్చారు. దీంతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే ఉద్దేశపూర్వకంగా తమ కోళ్లను కొట్టి చంపారని యజమానులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

కరోనా మహమ్మారి టెన్షన్ ఒకవైపు ఉంటే మరోవైవు బర్డ్ ఫ్లూ కలకలం మొదలైంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ నిర్దారణ కావడంతో, ఇప్పుడు ఆ ప్రభావం హైదరాబాద్ లో కూడా పడింది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో చికెన్ షాప్ లన్నీ వెలవెల బోతున్నాయి. 

Tags:    

Similar News