CAG report: అటవీ నిధులతో ఐఫోన్స్, ల్యాప్‌టాప్స్... ఆస్పత్రుల్లో ఎక్స్‌పైర్ అయిన మెడిసిన్

అటవీ సంరక్షణకు కేటాయించిన నిధులను సర్కారు ఐఫోన్స్, ల్యాప్‌టాప్స్, ఫ్రిజ్‌లు, కూలర్స్, ఆఫీస్ డెకరేషన్ కోసం...

Update: 2025-02-22 11:25 GMT

CAG report: అటవీ నిధులతో ఐఫోన్స్, ల్యాప్‌టాప్స్... ఆస్పత్రుల్లో ఎక్స్‌పైర్ అయిన మెడిసిన్

Forest dept funds used for buying laptops, iphones: ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడిందని కాగ్ రిపోర్ట్ వెల్లడించింది. అటవీ సంరక్షణకు కేటాయించిన నిధులను ఉత్తరాఖండ్ సర్కారు ఐఫోన్స్, ల్యాప్‌టాప్స్, ఫ్రిజ్‌లు, కూలర్స్, ఆఫీస్ డెకరేషన్ కోసం ఉపయోగించారని కాగ్ నివేదిక స్పష్టంచేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదిక ఆడిటింగ్ లో ఈ విషయం వెలుగుచూసినట్లు కాగ్ చెప్పింది. అటవీ శాఖ, ఆరోగ్య శాఖ, వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ విభాగాలు ప్రజాధనాన్ని ప్రణాళిక లేకుండా ఖర్చుచేశాయని కాగ్ ఆడిటింగ్ లో బయటపడింది. సరైన అనుమతులు లేకుండానే నిధులు ఇష్టారీతిన ఖర్చు చేశారని కాగ్ నివేదిక బట్టబయలుచేసింది.

2017-2021 మధ్య కాలంలో వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు లేకుండానే రూ. 607 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ పేర్కొంది. అంతేకాదు, చివరకు అటవీ భూములను కూడా ప్రభుత్వ అనుమతులు లేకుండానే బదలాయింపులు చేసినట్లు కాగ్ గుర్తించింది. నిన్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాగ్ నివేదికను ప్రవేశపెట్టడంతో ఈ విషయాలు వెలుగులొకొచ్చాయి.

సాధారణంగా కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (CAMPA) నిధులను అటవీ సంరక్షణ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఫండ్ లోంచి రూ. 14 కోట్లను ఇతర కార్యక్రమాల కోసం వినియోగించినట్లు కాగ్ ఆడిటింగ్‌లో తేలింది. ఈ నిధులతోనే ల్యాప్‌టాప్స్, ఫ్రిజ్‌లు, కూలర్స్, ఆఫీస్ రెనోవేషన్, కోర్టు కేసుల కోసం ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు.

కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో అటవీ భూములను ప్రభుత్వం ఇతర అవసరాల కోసం కేటాయించాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో కోల్పోయిన అటవీ భూములను మరో చోట భారీ సంఖ్యలో చెట్లు నాటి అడవులను పెంచడం జరుగుతుంటుంది. అలాంటి అవసరాల కోసం సేకరించిన ఈ నిధులను ఆ తరువాతి ఏడాది లేదా రెండేళ్ల వ్యవధిలోనే ఖర్చు చేసి అడవుల పెంపకం చేపట్టాల్సి ఉంటుంది. కానీ 37 సందర్భాలలో ఉత్తరాఖండ్ అటవీ శాఖ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ చేయడానికి 8 ఏళ్ల సమయం తీసుకుందని కాగ్ ఆడిటింగ్‌లో బయటపడింది.

అడవుల పెంపకం కోసం నాటిన చెట్లలో కనీసం 60-65 శాతం చెట్లను అటవీ శాఖ కాపాడాలి. ఇది ఒక కనీస నిబంధన. కానీ 2017-22 మధ్య కాలంలో నాటిన చెట్లలో 33 శాతం చెట్లు మాత్రమే బతికాయని కాగ్ చెబుతోంది. అంతేకాదు... అఫారెస్టేషన్ కోసం ఎంపిక చేసుకున్న భూముల విషయంలోనూ నిబంధనలు అతిక్రమించినట్లు తేలింది. 2014 - 2022 మధ్య జరిగిన 52 పనులలో కనీసం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అనుమతి కూడా లేకుండానే పనులు చేపట్టినట్లు గుర్తించారు.

అటవీ శాఖలో నిధుల దుర్వినియోగం ఇలా ఉంటే, ఆరోగ్య శాఖలో నిర్లక్ష్యం మరోస్థాయిలో ఉంది. ప్రభుత్వ దవాఖానల్లో కాలం చెల్లిన మందులు సరఫరా చేస్తున్నట్లు కాగ్ గుర్తించింది. కనీసం 3 ప్రభుత్వ దవాఖానల్లో 34 రకాల మందులు కాలం చెల్లినవే కాగా... అందులో కొన్ని రెండేళ్ల క్రితమే ఎక్స్‌పైరీ అయినట్లు తేలింది. అలాగే సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ కొరత కూడా అధికంగా ఉన్నట్లు కాగ్ నివేదిక బట్టబయలు చేసింది.

కాగ్ బయటపెట్టిన ఈ నివేదికతో ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ బీజేపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. అయితే, కాగ్ నివేదికలో వెలుగుచూసిన ఆరోపణలపై తను విచారణకు ఆదేశించానని అటవీ శాఖ మంత్రి సుబోద్ ఉనియల్ చెప్పారు.

Tags:    

Similar News