నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం..రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ

*రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే అవకాశం

Update: 2022-06-21 06:00 GMT

నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ

BJP: రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థి ఎంపికపై ఎన్డీఏ ముమ్మర కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీకానుంది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ కూడా హాజరుకానున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి కోసం పలువురు కేంద్రమంత్రులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులతో పాటు 14 మంది నేతలతో బీజేపీ ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

విపక్షాలు కూడా ఇవాళ మరోసారి భేటీకానున్నాయి. శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాతో పాటు గోపాలకృష్ణ గాంధీ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయమని ప్రకటించడంతో తదుపరి అభ్యర్ధి కోసం విపక్షాలు కసరత్తు మొదలుపెట్టింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆధ్వర్యంలో నేడు విపక్షాల నేతలు భేటీకానున్నారు. ఈ సమావేశానికి హాజరుకాలేనని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. మొదటి సమావేశాన్ని నిర్వహించిన మమతా రెండో సమావేశానికి దూరంగా ఉండటంతో ప్రతిపక్షాల ఐక్యత ప్రశ్నార్థకంగా మారింది. ఇవాళ జరిగే సమావేశానికి అకాలీదళ్, వైసీపీ కూడా గైర్హజరయ్యే అవకాశం ఉంది.

బీజేపీయేతర పక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు తెరపైకి వచ్చింది. రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేయాలని విపక్షాలు చేసిన విన్నపాలను గోపాలకృష్ణ గాంధీ తిరస్కరించడంతో ప్రతిపక్షాలకు కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఇవాళ జరిగే విపక్షాల సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించే అవకాశం ఉంది. యశ్వంత్ సిన్హాతో పాటు కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే పేరు కూడా విపక్షాలు పరిశీలిస్తున్నాయి.

Tags:    

Similar News