ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళకు అవకాశం? నలుగురిలో ఎవరికి ఆ ఛాన్స్?
Who will be Delhi new CM: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి కానీ ఢిల్లీ కొత్త సీఎం ఎవరు అనే ప్రశ్న మాత్రం అలానే ఉంది. ఇప్పటివరకు ఢిల్లీ సీఎం కోసం పర్వేష్ వర్మ పేరు ప్రముఖంగా వినిపించింది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుండి ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అర్వింద్ కేజ్రీవాల్‌ను ఓడించి వర్మ విజయం సాధించారు. అంతేకాకుండా ఢిల్లీలో బీజేపి విజయం కోసం కృషి చేశారు. దీంతో ఆయనకే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇంతలోనే మరో ప్రచారం కూడా తెరపైకొచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళకు అవకాశం కల్పించే ఆలోచనలో బీజేపి ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకోదిన మెజార్టీతో గెలిచిన మహిళా ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారు. షాలిమార్ బాగ్ నుండి రేఖ గుప్త ఆప్ అభ్యర్థిని వందన కుమారిపై 29,595 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గ్రేటర్ కైలాష్ నుండి ఆప్ లో బలమైన నేతల్లో ఒకరిగా పేరున్న సౌరబ్ భరద్వాజ్ పై శిఖా రాయ్ 3,188 ఓట్ల తేడాతో గెలిచారు.
వజీర్‌పూర్ స్థానం నుండి ఆప్ అభ్యర్థి రాజేష్ గుప్తపై పూనం శర్మ 11,425 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నజఫ్‌గఢ్ నుండి నీలం పహెల్వాన్ ఆప్ అభ్యర్థి తరుణ్ కుమార్‌పై 29,009 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
ప్రస్తుతం ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఫ్రాన్స్‌లో జరగనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ యాక్షన్ సమిట్‌కు హాజరయ్యేందుకు ఇవాళే ఆయన ఫ్రాన్స్ వెళ్లారు. ఆ తరువాత అమెరికా వెళ్లి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో భేటీ అవుతారు. ఈ 4 రోజుల విదేశీ పర్యటన అనంతరం ఇండియాకు తిరిగొస్తారు. ప్రధాని మోదీ ఇండియాకు వచ్చిన తరువాతే ఢిల్లీ కొత్త సీఎం పేరును ప్రకటించే అవకాశం ఉంది. రేఖ గుప్త, శిఖా రాయ్, పూనం శర్మ, నీలం పహెల్వాన్ లలో ఎవరో ఒకరిని బీజేపి అధిష్టానం సీఎం పదవికి ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
మహిళను ముఖ్యమంత్రి చేయడంతో పాటు ఢిల్లీ కొత్త కేబినెట్‌లోనూ డిప్యూటీ సీఎం పోస్ట్ నుండి కీలకమైన పదవుల వరకు మహిళలకు, దళితులకు, ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులకు ఎక్కువ అవకాశం ఇచ్చే యోచనలో బీజేపి హైకమాండ్ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రధాని మోదీ ఫారెన్ టూర్ నుండి వస్తే కానీ బీజేపి హై కమాండ్ ప్లాన్స్ నిజమేనా లేక మారుతాయా అనే విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
Why BJP crushing regiona parties: దిల్లీలో బీజేపీ విజయంతో ప్రాంతీయ పార్టీలు జడుసుకున్నాయా?