Bangladesh Violence: 35 రోజుల్లో 11 మంది హిందువుల హత్యలు.. బంగ్లాలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు
బంగ్లాదేశ్‌లో 35 రోజుల్లో 11 మంది హిందువులు హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. ఎన్నికల వేళ శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి.
Bangladesh Violence: 35 రోజుల్లో 11 మంది హిందువుల హత్యలు.. బంగ్లాలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు
బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస హత్యలు అక్కడి శాంతిభద్రతలపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం 35 రోజుల వ్యవధిలో 11 మంది హిందువులు హత్యకు గురికావడం దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ఘటనలు జరగడం రాజకీయంగా, సామాజికంగా కీలకంగా మారాయి.
డిసెంబర్ నెల మధ్య నుంచి జనవరి మొదటి వారానికి మధ్య బంగ్లాదేశ్‌లోని పలు జిల్లాల్లో హిందువులపై దాడులు, హత్యలు జరిగాయి. మైమెన్‌సింగ్ జిల్లాలో గార్మెంట్ ఫ్యాక్టరీ కార్మికుడు దీపు చంద్రదాస్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. అతడిని కొట్టి చంపి, మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి తగలబెట్టిన ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కేసులో పోలీసుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి.
దీపు చంద్రదాస్ హత్య అనంతరం జెస్సోర్, ఫరీద్‌పూర్, రాయ్‌పురా, ఇతర జిల్లాల్లో వరుసగా హత్యలు చోటుచేసుకున్నాయి. కిరాణ వ్యాపారి మణి చక్రవర్తి, హిందూ పత్రిక ఎడిటర్ రాణా కాంతి బైరాగి, ఆటో డ్రైవర్ శాంతో చంద్రదాస్, వ్యాపారులు ఉత్పోల్ సర్కార్, ప్రంతోష్ కోర్మోకర్ సహా పలువురు హిందువులు హత్యకు గురయ్యారు. ఈ ఘటనల్లో కొందరిని గొంతుకోసి, మరికొందరిని కాల్చి, ఇంకొందరిని నరికి చంపడం తీవ్ర కలచివేతకు గురిచేస్తోంది.
1971 విముక్తి యుద్ధంలో పాల్గొన్న ముక్తిజోద్ధ మరియు ఆయన భార్య కూడా ఈ హింసలో ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. డిసెంబర్ 2 నుంచి జనవరి 5 మధ్య జరిగిన హత్యల జాబితా చూస్తే, హిందూ సమాజంపై దాడులు పెరిగాయనే భావన బలపడుతోంది.
అయితే బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఈ హత్యలు మతపరమైనవి కావని, వ్యక్తిగత శత్రుత్వాలు, వ్యాపార వివాదాల కారణంగానే జరిగాయని చెబుతోంది. మరోవైపు హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్య పరిషత్ (BHBCUC) సహా పలు మానవ హక్కుల సంస్థలు మాత్రం హిందువులను లక్ష్యంగా చేసుకుని హింస జరుగుతోందని ఆరోపిస్తున్నాయి.
షేక్ హసీనా రాజీనామా అనంతరం దేశంలో రాజకీయ అస్థిరత పెరగడం, రాడికల్ శక్తులు బలపడటం, యాంటీ హిందూ భావనలు పెరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై అంతర్జాతీయ స్థాయిలోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హిందువుల హత్యలపై నిష్పక్షపాత దర్యాప్తు జరుగుతుందా? లేదా ఇవి సాధారణ నేరాలుగా మిగిలిపోతాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.