Ram Mandir Pran Pratishtha: ఐదు శతాబ్దాల కల సాకారం.. వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ట

Ram Mandir Pran Pratishtha: ప్రాణప్రతిష్టలో పాల్గొన్న ప్రధాని మోడీ, RSS చీఫ్ మోహన్‌ భగవత్

Update: 2024-01-22 08:02 GMT

Ram Mandir Pran Pratishtha: ఐదు శతాబ్దాల కల సాకారం.. వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ట

Ram Mandir Pran Pratishtha: అయోధ్యలో అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది. రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది. నీలమేఘశ్యాముడి ప్రాణప్రతిష్ట వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.దాదాపు 500 ఏళ్ల హిందువుల కల సాకారమైంది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాలావతారంలో కొలువు దీరాడు. ప్రధాని మోడీ చేతుల మీదుగా బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట క్రతువు జరిగింది. మేషలగ్నం అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగింది.

విగ్రహ ప్రతిష్టకు కర్తగా ప్రధాని మోడీ వ్యవహరించారు. రామనామ స్మరణతో అయోధ్య మారుమోగిపోయింది. అతిరథ మహారథులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సెలబ్రెటీలు వేడుకను కనులారా తిలకించారు. అదే సమయంలో జై శ్రీరామ్ నినాదంతో యావత్ భారతావని పులకించింది. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో స్వర్ణాభరణాలు ధరించి.. చిరుదరహాసం, ప్రసన్నవదనంతో బాలరాముడి దర్శనమిచ్చారు.

కోట్లాది మంది హిందువుల శతాబ్దాల కల నెరవేరింది. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట క్రతువు పూర్తయింది. వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోడీ, RSS చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్ట ముగిసిన తర్వాత ప్రధాని మోడీ స్వామి వారి విగ్రహం వద్ద తొలి పూజ చేశారు. ఆయన పాదాల వద్ద పూలను ఉంచి నమస్కరించి, ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగిసిన వెంటనే రామజన్మభూమిపై హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించారు. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. నగరం మొత్తం ఆధ్మాత్మిక శోభతో కళకళలాడింది. నగరమంతా రామ్ లీల భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మరోవైపు, రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని దేశ ప్రజలంతా భారీ స్ర్కీన్ లు, టీవీల ద్వారా వీక్షించారు. ఒక అద్భుతమైన, అపూర్వమైన ఘట్టాన్ని వీక్షించిన ప్రజలంతా అనీర్వచనీయమైన అనుభూతికి లోనయ్యారు. యావత్ భారతావని దేశ రామ నామ స్మరణతో మారుమోగింది.

Tags:    

Similar News