Train Accident In Bihar: బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన నార్త్-ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ ఐదు కోచ్‌లు..

Train Accident In Bihar: స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించిన అధికారులు

Update: 2023-10-12 02:29 GMT

Train Accident in Bihar: బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన నార్త్-ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ ఐదు కోచ్‌లు..

Train Accident In Bihar: ఒడిశా ట్రాజెడీ మరవకముందే.. బీహార్‌లో మరో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఓ రైలులోని 21 బోగీలు పట్టాలు తప్పాయి. బక్సర్ జిల్లాలోని రఘునాథ్‌పూర్‌ స్టేషన్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

70 నుంచి 80 కిలోమీటర్ల వేగం.. ఆనంద్ విహార్ నుంచి కామాఖ్య వెళ్తోన్న నార్త్ ఈస్ట్ సూపర్‌ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ అప్పుడే బక్సర్ జిల్లా రఘునాథ్‌పూర్‌ స్టేషన్‌కు చేరుకుంది. రాత్రి 9 గంటల 30 నిమిషాల తర్వాత ఉన్నట్టుండి భారీ శబ్దాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేశాయి. అది విన్న సెకన్లలోపే బోగీల్లో నుంచి వచ్చిన హాహాకారాలు వారిని షాక్‌కు గురిచేశాయి. ఏం జరిగిందని చూస్తే.. పట్టాలు తప్పిన కొన్ని బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

ఈ ఘటన జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోగీల్లో నుంచి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు కూడా వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. స్థానికులతో పాటు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని హాస్పిటల్స్‌కు తరలించారు. తీవ్ర గాయాలపాలైన వారిని పాట్నాలోని ఎయిమ్స్‌కు తరలించారు.

రైలు పట్టాలు తప్పడం.. భారీ శబ్దాలతో రైల్లోని ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విషయం తెలుసుకుని కంగుతిన్నారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించగా.. మిగిలిన ప్రయాణికులు ఉన్న పళంగా తమ ఫ్యామిలీలను తీసుకొని రఘునాథ్‌పూర్ స్టేషన్‌కు వెళ్లారు. రఘునాథ్‌పూర్‌ నుంచి ప్రత్యేక రైలును ఏర్పాటు చేసిన అధికారులు.. మిగిలిన ప్రయాణికులకు వారి గమ్యస్థానాలకు చేరవేశారు.

ఈ ఘటనపై బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే కూడా ప్రమాదంపై స్పందించారు. NDRF సిబ్బందిని ఘటనా స్థలానికి పంపినట్లు తెలిపారు. ఇక ఘటనకు సంబంధించిన వివరాలపై రైల్వే అధికారులను అడగ్గా.. సహాయక చర్యల అనంతరం కారణాలపై ఆరా తీస్తామని తెలిపారు. ఘటనకు కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Tags:    

Similar News