Assam: సిల్చార్‌లో నడుము లోతు వరదలో పసికందును తీసుకెళ్లిన తండ్రి

Assam: చిన్ని కృష్ణుడిని ఎత్తుకుని యమునను దాటుతున్న వసుదేవుడిని తలపించిన దృశ్యం

Update: 2022-06-21 11:38 GMT

Assam: సిల్చార్‌లో నడుము లోతు వరదలో పసికందును తీసుకెళ్లిన తండ్రి

Assam: అస్సాంను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికీ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. అయితే ఈ వరదల్లో ఓ ఆసక్తికరమైన దృశ్యం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అస్సాంలోని సిల్చార్‌లో అప్పుడే పుట్టిన పసికందును నడుములోతు వరద నీటిలో తీసుకెళ్లాడు. ఈ దృశ్యాన్ని చూస్తే మనకు చిన్ని కృష్ణుడిని ఎత్తుకుని యమునా నదిని దాటుతున్న వసుదేవుడే గుర్తొస్తాడు. బిడ్డను చూసి మురిసిపోతూ తండ్రి ఆనందంగా తీసుకెళ్లాడు. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి కృష్ణుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ప్రతి రోజూ ఫాదర్స్‌ డే అని ఆ తండ్రి ఆనందం చూసి పొగిడేస్తున్నారు.

అస్సాంలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 47 లక్షల మంది వరదతో ఇబ్బందులు పడుతున్నారు. 36 జిల్లాలో 32 జిల్లాలు ముంపునకు గురయ్యాయి. 4వేలకు పైగా గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. వరదల్లో ఇప్పటివరకు 80 మంది మృతి చెందారు. బరాక్‌ లోయ ప్రాంతంలో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఈ ప్రాంతంలో రవాణా మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయి. రైలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. ముంపు ప్రాంతాల్లో అస్సాం పోలీసులు, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ-ఎన్‌డీఎర్‌ఎఫ్ సహాయక చర్యలు చేపట్టాయి. వరద ప్రభావంపై ఇప్పటికే ముఖ్యమంత్రి హిమంత్‌ బిస్వాస్‌ శర్మతో ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్‌షా మాట్లాడారు. అవసరమైన సాయం కేంద్రం అందిస్తుందని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News