Arvinder Singh: ఢిల్లీ పీసీసీ చీఫ్ రాజీనామా.. అర్వీందర్ సింగ్ రాజీనామాతో కాంగ్రెస్ కు జరిగేదేంటి?

Arvinder Singh: ఢిల్లీలో కాంగ్రెస్ కు భారీ కుదుపు తగిలింది. సార్వత్రిక ఎన్నికల ముంగిట ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అర్వీందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు.

Update: 2024-04-29 15:00 GMT

Arvinder Singh: ఢిల్లీ పీసీసీ చీఫ్ రాజీనామా.. అర్వీందర్ సింగ్ రాజీనామాతో కాంగ్రెస్ కు జరిగేదేంటి?

Arvinder Singh: ఢిల్లీలో కాంగ్రెస్ కు భారీ కుదుపు తగిలింది. సార్వత్రిక ఎన్నికల ముంగిట ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అర్వీందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాకు కేవలం వ్యక్తిగత కారణాలు చూపడం లేదు. పార్టీగతమైన కారణాలు, సంస్థాగత నిర్ణయాలు, కాంగ్రెస్ భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న నిర్ణయాలపై.. చాలా లవ్లీగా గళమెత్తారు. ఆయన రాజీనామాకు దారి తీసిన పరిస్థితులేంటి? కాంగ్రెస్ అధినాయకత్వం చేసిన తప్పిదాలేంటి?

ఎన్నికల ఆపరేషన్ రసపట్టులో ఉన్న సమయంలో కాంగ్రెస్ బండి భారీ కుదుపునకు గురైంది. ఢిల్లీ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ అర్వీందర్ సింగ్ లవ్లీ ఎంతో బరువెక్కిన హృదయంతో రాజీనామా చేశారు. కాంగ్రెస్ కు ఎంతో నమ్మకమైన సైనికుడిలా ఎదిగిన లవ్లీ.. పార్టీలో పేరుకుపోయిన ఒంటెత్తుపోకడల కారణంగా తాను ఏ చిన్న నిర్ణయం కూడా తీసుకోలేకపోతున్నానని.. తీసుకున్న నిర్ణయాలను అమలు చేయలేకపోతున్నానని.. కార్యకర్తల సెంటిమెంట్లను కాపాడలేకపోతున్నానని.. అలాంటప్పుడు తాను పార్టీలో ఉండి సాధించేదేమిటి అంటూ లోగుట్టు విప్పుతున్నారు లవ్లీ.

పార్టీకి ఎంతో అంకితభావంతో పనిచేసిన లవ్లీ... ఏఐసీసీలోని కొందరు పెద్దల పనితీరు తనకు చాలా ఇబ్బందికరంగా మారిందంటున్నారు. శతాధిక వసంతాల ఘన చరిత్ర గల కాంగ్రెస్ కు... నిన్న గాక మొన్న కళ్లు తెరిచిన ఆమ్ ఆద్మీ పార్టీ పాఠాలు నేర్పే దుస్థితిలోకి దిగజారిపోయిందని ఆవేదన చెందుతున్నారట. పార్టీ ఎదుర్కొంటున్న ఇలాంటి దుస్థితి నుంచి ఏమాత్రం గుణాపాఠాలు నేర్చుకోవడం లేదని.. అసలు గ్రౌండ్ లెవల్లో పనిచేసేవారి నిర్ణయాధికారాలను లాగేసుకొని.. ఇంచార్జుల పేరుతో వచ్చిన అధినేతల మనుషులు చెప్పే మాటలకే చెల్లుబాటు ఉంటోందని.. అలాంటప్పుడు కేడర్ ను తామెలా సంతృప్తిపరుస్తామంటూ సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు లవ్లీ. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన 4 పేజీల సుదీర్ఘమైన లేఖలో తన మనోభావాలు ఆవిష్కరించారట అర్వీందర్ సింగ్ లవ్లీ. ఆయన ఖర్గేకు రాజీనామా లేఖ పంపిన విషయం తెలుసుకున్న కార్యకర్తలు లవ్లీ ఇంటికి చేరుకొని ఆయనకు సంఘీభావం ప్రకటించారు. లవ్లీ ఇదే స్టాండు మీద ఉండాలని.. అప్పుడే కాంగ్రెస్ కాస్తో, కూస్తో బాగుపడుతుందని కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.

అసలు తన రాజీనామాకు లవ్లీ చెబుతున్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆమ్ ఆద్మీ పార్టీలోని పలువురు మంత్రులు, ముఖ్యనేతలు, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు జీవితం గడుపుతున్నారు. అవినీతిలో కూరుకుపోయిన ఆమ్ ఆద్మీ నేతలు.. కాంగ్రెస్ మీద అవినీతి విమర్శలు చేస్తుంటే.. దాన్ని తిప్పికొట్టాల్సింది పోయి.. అదే పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటున్నారనేది అర్వీందర్ సింగ్ లవ్లీ సంధిస్తున్న పదునైన అస్త్రం. దాదాపు గత పదేళ్లుగా ఢిల్లీలో కాంగ్రెస్ దారుణంగా దెబ్బ తింటూ వస్తోందని.. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి కాయకల్ప చికిత్స చేయాల్సింది పోయి.. పూర్తి కేడర్ నైతిక స్థైర్యం దెబ్బతినేలా అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలతో తాను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే భావనకు వచ్చానని.. ఆ లేఖలో ఖర్గేకు చెప్పారట లవ్లీ. రాష్ట్ర పార్టీ చీఫ్ గా తాను తీసుకునే నిర్ణయాలకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా, ఢిల్లీ ఇంచార్జిగా ఉన్న దీపక్ బబారియా అడ్డు పడుతున్నారని.. కనీసం మీడియా హెడ్ ని కూడా తాను నియమించుకోలేకపోయానని లవ్లీ ఆరోపిస్తున్నారు. గతేడాది ఆగస్టులో ఢిల్లీ స్టేట్ చీఫ్ గా నియామకం అయినప్పటి నుంచీ ఇదే తంతు నడుస్తోందని లవ్లీ ఆ లేఖలో పేర్కొనడం విశేషం. ఏ ఒక్క నిర్ణయం తీసుకోనివ్వకుండా.. ఎవ్వరినీ అపాయింట్ చేయనివ్వకుండా దీపక్ శనిలా అడ్డు తగులుతున్నారట. ఢిల్లీలో దాదాపు 150 బ్లాక్ ప్రెసిడెంట్లను కూడా నియామకం చేయనివ్వలేదని.. తాను ఎవరిని సూచించినా సింపుల్ గా రిజెక్ట్ చేస్తున్నారనేది లవ్లీ ఆరోపణ. 150 కి పైగా బ్లాకులకు అధ్యక్షులనే నియమించకపోతే కేడర్ ఏవిధంగా పటిష్టం అవుతుందనేది సంస్థాగతంగా సంధిస్తున్న ప్రశ్న. పార్టీలో అంతర్గత సమస్యలను పరిష్కరించాల్సిన నేతలు.. వాటిని పట్టించుకోకుండా.. శత్రు పార్టీలతో పొత్తుల విషయంలో ఇంట్రస్ట్ చూపిస్తూ కాంగ్రెస్ ను దినదినం పాతరేస్తున్నారంటున్నారనేది లవ్లీ ఆవేదన.

ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తును ఢిల్లీ కాంగ్రెస్ వ్యతిరేకించినా.. రాహుల్ తో చనువుగా వ్యవహరించే దీపక్ బబారియాకు పూర్తి అధికారాలు కట్టబెట్టి.. పొత్తు నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటూ తీవ్రనష్టం కలిగిస్తున్నారంటున్నారు అర్వీందర్ సింగ్ లవ్లీ. లవ్లీని ఆయన ఇంట్లో పరామర్శించిన తరువాత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సందీప్ దీక్షిత్ విలేకరులతో మాట్లాడారు. లవ్లీ లేవనెత్తిన అంశాలు పార్టీపరంగా ఆలోచించాల్సినవేనని ఆయన చెప్పడం విశేషం. ఆయన మనసులో ఇంకా ఏముందో తనకు తెలియదని.. కానీ ఆయన లేవనెత్తిన అంశాలు మాత్రం కచ్చితంగా పరిష్కరించాల్సినవేనని కేడర్ అంతా కోరుకుంటోందంటున్నారు దీక్షిత్. ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడే తప్ప.. పార్టీకి రాజీనామా చేయలేదని.. అందువల్ల ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తున్నారని తాను అనుకోవడం లేదంటున్నారు సందీప్ దీక్షిత్.

పార్టీ కోసం ఇష్టం లేకపోయినా కొన్ని చర్యలను, నిర్ణయాలను శిరసావహించానని లవ్లీ చెబుతున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు ఆయనకు సంఘీభావంగా కేజ్రీవాల్ ఇంటికి సుభాష్ చోప్రా, సందీప్ దీక్షిత్ లాంటి సీనియర్లతో కలిసి వెళ్లానంటున్నారు. మనసు వారిస్తున్నా.. పార్టీ తీసుకున్న వైఖరి కారణంగా బాహాటంగా కేజ్రీవాల్ కు మద్దతు పలికానంటున్నారు. తాను ఒక్కడే కాదు.. స్టేట్ పార్టీ మొత్తాన్ని కూడా ఏఐసీసీ వైఖరికి అనుగుణంగా స్పందించేలా కేడర్ ను ప్రిపేర్ చేసి పెట్టానని.. మరి దీన్ని అలుసుగా తీసుకున్నారో ఏమో తెలీదు కానీ.. అసలు స్టేట్ పార్టీకి ఎక్కడా విలువ ఇవ్వడం లేదని.. అలాంటప్పుడు తాను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేననేది లవ్లీ వాదనగా తెలుస్తోంది. పలువురు ఆప్ మంత్రులు కరప్షన్ చార్జెస్ మీద జైలు పాలైనప్పుడు.. ఏఐసీసీ నేతలు వారితో పొత్తు ఏవిధంగా పెట్టుకుంటారన్న ప్రశ్నకు ఇప్పటికైతే ఏఐసీసీ దగ్గర సమాధానం కనిపించడం లేదు. పార్టీ వర్కర్స్ అందరూ వ్యతిరేకిస్తున్న ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పుకోవాల్సిన సమయం వచ్చిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. 

Tags:    

Similar News