Union Budget 2026: భారత బడ్జెట్ చరిత్రలో అరుదైన ఘట్టం: చిదంబరం రికార్డును సమం చేయనున్న నిర్మలా సీతారామన్!

Union Budget 2026: దేశ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ ముహూర్తం ఖరారైంది.

Update: 2026-01-30 08:58 GMT

Union Budget 2026: దేశ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1, 2026 (ఆదివారం)న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆమె ఒక అరుదైన మైలురాయిని అధిగమించబోతున్నారు.

నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డు: ఒకే ప్రధానమంత్రి పదవీకాలంలో వరుసగా తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు. 2019లో బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఇప్పటివరకు ఎనిమిది బడ్జెట్లను (ఒక మధ్యంతర బడ్జెట్‌తో కలిపి) విజయవంతంగా సమర్పించిన ఆమె, ఈ ఏడాది 9వ ప్రసంగాన్ని చేయబోతున్నారు.

భారత బడ్జెట్ ప్రస్థానం - మైలురాళ్లు: భారతదేశ బడ్జెట్ చరిత్ర 160 ఏళ్ల నాటిది. దీనికి సంబంధించిన కొన్ని కీలక ఘట్టాలు:

తొలి బడ్జెట్ (బ్రిటిష్ కాలం): ఏప్రిల్ 7, 1860న జేమ్స్ విల్సన్ భారతదేశపు మొట్టమొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

స్వతంత్ర భారత తొలి బడ్జెట్: నవంబర్ 26, 1947న తొలి ఆర్థిక మంత్రి ఆర్‌.కె. షణ్ముఖం చెట్టి స్వతంత్ర భారతావని తొలి పద్దును చదివారు.

ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన దిగ్గజాలు: భారత బడ్జెట్ చరిత్రలో అత్యధిక సార్లు పద్దులు సమర్పించిన రికార్డు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరుతో ఉంది.

మొరార్జీ దేశాయ్: మొత్తం 10 బడ్జెట్లను ప్రవేశపెట్టి అగ్రస్థానంలో ఉన్నారు.

పి. చిదంబరం: ఈయన మొత్తం 9 సార్లు బడ్జెట్ ప్రసంగాలు చేశారు.

నిర్మలా సీతారామన్: ఈ ఏడాది బడ్జెట్‌తో చిదంబరం రికార్డును ఆమె సమం చేయనున్నారు.

ప్రణబ్ ముఖర్జీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు బడ్జెట్ సమర్పించారు.

మన్మోహన్ సింగ్: ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరుగాంచిన మన్మోహన్ సింగ్, 1991-1995 మధ్య వరుసగా 5 బడ్జెట్లను ప్రవేశపెట్టారు.

ఆదివారం సమర్పించబోయే బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా సామాన్యులు, వేతన జీవులు మరియు పారిశ్రామిక వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను రాయితీలు, సంక్షేమ పథకాలపై నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటనలు చేస్తారనేది ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News