Budget 2026-27: ఆదివారం హాలీడే కాదు..బడ్జెట్ డే..నిర్మలమ్మ లెక్కల పెట్టెలో ఏముందో తెలుసా ?
ఆదివారం హాలీడే కాదు..బడ్జెట్ డే..నిర్మలమ్మ లెక్కల పెట్టెలో ఏముందో తెలుసా ?
Budget 2026-27: ఫిబ్రవరి 1, 2026.. ఈ ఆదివారం యావత్ భారతదేశం కళ్లు పార్లమెంట్ వైపే ఉండబోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా బడ్జెట్ అంటే పనిదినాల్లో ప్రవేశపెట్టడం మనకు తెలుసు. కానీ, ఇటీవలి చరిత్రలో తొలిసారిగా ఒక ఆదివారం నాడు (ఫిబ్రవరి 1, 2026) కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటం విశేషం. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల మార్కెట్లకు విశ్లేషించుకునే సమయం దొరుకుతుందని, సోమవారం నాటికి ఇన్వెస్టర్లు ఒక క్లారిటీతో ఉంటారని నిపుణులు భావిస్తున్నారు.
బడ్జెట్ ప్రయాణం.. మారిన సంప్రదాయాలు
గతంలో బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి రోజున సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టే వారు. అయితే మోదీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ సంప్రదాయాన్ని మార్చారు. బడ్జెట్ కేటాయింపులు కొత్త ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1) ప్రారంభం నాటికే అన్ని శాఖలకు చేరాలనే ఉద్దేశంతో తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. అలాగే సమయాన్ని కూడా ఉదయం 11 గంటలకు మార్చడం జరిగింది.
రాజ్యాంగం ఏం చెబుతోంది?
బడ్జెట్ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా కనిపించదు. ఆర్టికల్ 112 ప్రకారం, ప్రభుత్వం ప్రతి ఏడాది తన ఆదాయ వ్యయాల అంచనాను పార్లమెంట్‌కు సమర్పించాలి. దీనినే రాజ్యాంగ భాషలో వార్షిక ఆర్థిక నివేదిక అంటారు. ఇది ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయి, ఖర్చు చేసే ప్రతి పైసాకు సంబంధించిన లెక్కల చిట్టా.
రెవెన్యూ vs క్యాపిటల్
బడ్జెట్‌ను ప్రధానంగా రెండు భాగాలుగా విభజించవచ్చు
రెవెన్యూ బడ్జెట్: ఇది ప్రభుత్వం సంపాదించే పన్నులు (GST, ఇన్‌కమ్ ట్యాక్స్), ప్రభుత్వం నడపడానికి అయ్యే రోజూవారీ ఖర్చుల (జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు) గురించి చెబుతుంది. ఇందులో వచ్చే లోటును రెవెన్యూ డెఫిసిట్ అంటారు.
క్యాపిటల్ బడ్జెట్: ఇది దేశం కోసం ఆస్తులను సృష్టించే విభాగం. అంటే కొత్త రోడ్లు, రైల్వేలు, ఆసుపత్రులు, భారీ ప్రాజెక్టుల నిర్మాణం కోసం చేసే ఖర్చు. ఇది దేశ దీర్ఘకాలిక అభివృద్ధికి పునాది.
సామాన్యుడి ఆశలు.. ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబులు
ఈసారి బడ్జెట్‌పై మధ్యతరగతి ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతారని అందరూ ఆశిస్తున్నారు. గత బడ్జెట్‌లో రూ.12 లక్షల వరకు పన్ను లేకుండా వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో ఈసారి ఆ పరిమితిని మరింత పెంచడమో లేదా స్టాండర్డ్ డిడక్షన్ పెంచడమో చేస్తారని ట్యాక్స్ పేయర్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
వికసిత భారత్ లక్ష్యం
ఆర్థిక సర్వే ప్రకారం, దేశ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉండే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ ఇప్పటికే సూచించారు. దేశంపై నమ్మకంతో ఉన్నామని, ప్రపంచానికే భారత్ ఒక ఆశాకిరణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. సామాజిక న్యాయం, ఆర్థిక వృద్ధి, జాతీయ భద్రతలో భారత్ సాధించిన విజయాలను గుర్తుచేశారు.