బ్రిటన్ కు కొత్త టెన్షన్
* దక్షిణాఫ్రికా నుంచి బ్రిటన్‌లో అడుగుపెట్టిన వైరస్ * ఈ వైరస్ చాలా ప్రమాదకరమంటున్న బ్రిటన్ ఆరోగ్య మంత్రి * అతివేగంగా వ్యాప్తి చెందుతుందని మంత్రి హెచ్చరిక * అప్రమత్తమైన బ్రిటన్ ప్రభుత్వం
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ ఓ ఆట ఆడుకుంది. ఇప్పుడిప్పుడే దేశాలు కోలుకుంటున్నాయి. కానీ బ్రిటన్‌కు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. మూలిగే నక్కపై తాటిపండు పండట్లు ఇప్పుడు కొత్త వైరస్ ఆ దేశంపై అటాక్ చేస్తోంది. కరోనా వైరస్ కొత్త రకం స్ట్రెయిన్‌తో బ్రిటన్ దేశస్తులు బెంబేలెత్తిపోతున్నారు. సౌతాఫ్రిక్‌లో మార్పు చెందిన ఈ కొత్త రకం వైరస్ బ్రిటన్‌లో కాలు మోపింది.
ఈ కొత్త రకం కరోనా వైరస్ చాలా ప్రమాదకరమని బ్రిటన్ ఆరోగ్య మంత్రి మట్ హన్‌కాక్ ప్రకటించారు. ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని వెల్లడించారు. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులకు ఈ వైరస్ సోకినట్టు నిర్ధారించారు. ఇటీవల దక్షిణాఫ్రికాకు వెళ్లి వచ్చిన వారి నుంచే ఇది దేశంలోకి ఎంటర్ అయ్యిందని వివరించారు.
ఇద్దరు వ్యక్తులకు కొత్త రకం కరోనా సోకడంతో బ్రిటన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికుల రాకపోకలపై నిషేధించారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన లాక్‌డౌన్‌ను మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాకు వెళ్లి వచ్చిన వారు 15 రోజులపాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని ప్రభుత్వం సూచించింది.