Earthquake: ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు

Earthquake: ఈశాన్య రాష్ట్రాల్లో సోమవారం తెల్లవారుజామున వరుస భూప్రకంపనలు సంభవించాయి.

Update: 2026-01-05 05:44 GMT

Earthquake: ఈశాన్య రాష్ట్రాల్లో సోమవారం తెల్లవారుజామున వరుస భూప్రకంపనలు సంభవించాయి. అస్సాం, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గాఢనిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా కుదుపులు రావడంతో జనం ఇళ్ల నుంచి ఖాళీ ప్రదేశాలకు పరుగులు తీశారు.

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) నివేదిక ప్రకారం, అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున 4:17 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. భూ అంతర్భాగంలో సుమారు 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. దీని ప్రభావంతో గువాహటితో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రకంపనలు బలంగా కనిపించాయి.

అదే సమయంలో త్రిపుర రాష్ట్రంలో కూడా భూమి కంపించింది. త్రిపురలోని గోమతి జిల్లాలో రిక్టర్ స్కేలుపై 3.9 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. అస్సాం, త్రిపురలతో పాటు పొరుగున ఉన్న మేఘాలయ రాష్ట్రంలో కూడా పలుచోట్ల స్వల్పంగా భూమి కంపించింది.

ఈ భూకంపం కారణంగా అస్సాంలోని మోరిగావ్‌లో ఇళ్లలోని వస్తువులు కింద పడిపోవడం, గోడలకు స్వల్పంగా పగుళ్లు రావడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, ఇప్పటివరకు ఎక్కడా ఎటువంటి ప్రాణ నష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారికంగా రిపోర్టులు అందలేదు. విపత్తు నిర్వహణ బృందాలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

ఈశాన్య భారతం అత్యంత ప్రమాదకరమైన సిస్మిక్ జోన్ (Zone-V) పరిధిలోకి వస్తుందని, అందుకే ఈ ప్రాంతంలో తరచుగా భూప్రకంపనలు సంభవిస్తుంటాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Tags:    

Similar News