CBI Notice: టీవీకే అధినేత విజయ్‌కు సీబీఐ నోటీసులు

CBI Notice to Vijay: తమిళనాడులోని కరూర్‌లో చోటుచేసుకున్న ఘోర తొక్కిసలాట ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) విచారణను ముమ్మరం చేసింది.

Update: 2026-01-06 09:20 GMT

CBI Notice to Vijay: తమిళనాడులోని కరూర్‌లో చోటుచేసుకున్న ఘోర తొక్కిసలాట ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసులో కీలక పరిణామంగా తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్‌కు సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 12వ తేదీన ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

41 మందిని బలితీసుకున్న దుర్ఘటన

2025 సెప్టెంబర్ 27న కరూర్‌లోని వేలుస్వామిపురంలో విజయ్ నిర్వహించిన రాజకీయ ర్యాలీలో ఊహించని విధంగా జనం పోటెత్తారు. దాదాపు 10 వేల మంది వస్తారని అంచనా వేయగా, సుమారు 27 వేల మందికి పైగా హాజరయ్యారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి సిబిఐ

తొలుత ఈ కేసును రాష్ట్ర పోలీసులు విచారించినప్పటికీ, బాధితులకు న్యాయం జరగాలంటే స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని టీవీకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం, అక్టోబర్‌లో కేసును సిబిఐకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాకుండా, రిటైర్డ్ జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలోని కమిటీ ఈ విచారణను పర్యవేక్షించాలని ఆదేశించింది.

విచారణలో కీలకం కానున్న విజయ్ స్టేట్‌మెంట్

ర్యాలీ నిర్వహణలో భద్రతా లోపాలు, అనుమతి తీసుకున్న దానికంటే ఎక్కువ మంది రావడం, మరియు విజయ్ రాక ఏడు గంటల ఆలస్యం కావడం వంటి అంశాలపై సిబిఐ అధికారులు విజయ్‌ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ విచారణతో కరూర్ విషాదానికి అసలు కారణాలు వెలుగులోకి వస్తాయని బాధితుల కుటుంబాలు ఆశిస్తున్నాయి.

Tags:    

Similar News