Sonia Gandhi Health Update: సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీలో ఆస్పత్రిలో చేరిక
ఢిల్లీ వాయు కాలుష్యం ప్రభావంతో సోనియా గాంధీకి శ్వాసకోశ సమస్యలు తలెత్తాయి. హుటాహుటీన సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Sonia Gandhi Health Update: సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీలో ఆస్పత్రిలో చేరిక
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో పలువురు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా దగ్గు, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సోనియా గాంధీకి సోమవారం అర్ధరాత్రి ఊపిరి పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవడంతో ఆమెను హుటాహుటీన ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చేరిన అనంతరం సోనియా గాంధీకి వైద్యులు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం ప్రభావం వల్లే ఈ అస్వస్థత ఏర్పడిందని వైద్యులు తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండు నుంచి మూడు రోజుల్లో ఆమె పూర్తిగా కోలుకునే అవకాశముందని పేర్కొన్నారు.
ఇక సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. పలువురు కాంగ్రెస్ నేతలు ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. గతంలోనూ ఛాతీ సంబంధిత సమస్యల కారణంగా సోనియా గాంధీకి వైద్య చికిత్స అందించిన సందర్భాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆరోగ్యాన్ని నిపుణులైన వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.