Uttarakhand Avalanche: బ్రో శిబిరంపై కూలిన మంచు చరియలు.. ప్రమాదంలో 41 మంది ప్రాణాలు

Update: 2025-02-28 10:00 GMT

Uttarakhand Avalanche: బ్రో శిబిరంపై కూలిన మంచు చరియలు.. ప్రమాదంలో 41 మంది ప్రాణాలు 

ఉత్తరాఖండ్‌ బద్రినాధ్ సమీపంలోని చమోలి జిల్లా మన గ్రామంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌కు (BRO) సంబంధించిన కార్మికులు రోడ్డు నిర్మాణం పనులు చేస్తుండగా వారి శిబిరంపై మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మొత్తం 57 మంది కార్మికులు చిక్కుకోగా వారిలోంచి 16 మందిని కాపాడారు. మరో 41 మంది మంచు చరియల కిందే చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు ఇండియన్ ఆర్మీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు, రెస్క్యూ టీమ్ బలగాలు శ్రమిస్తున్నాయి. ఈ ప్రాంతంలో భారీగా మంచు కురుస్తోంది. దీంతో సహాయ చర్యలకు, మరిన్ని రెస్క్యూ టీమ్స్ తరలింపులో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. 

ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. మంచు చరియల కింద చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ధామి తెలిపారు. ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు సిబ్బంది సహాయం కూడా తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు.

బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ సీఆర్ మీనా కూడా ఈ ఘటనపై స్పందించారు. ఇప్పటికే ఘటనా స్థలానికి నాలుగు అంబుసలెన్సులు పంపించినట్లు తెలిపారు. అయితే, భారీగా మంచు కురుస్తుండటంతో ఘటనా స్థలానికి చేరుకోవడం ఇబ్బందిగా మారిందన్నారు.

బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ విషయానికొస్తే... దేశ సరిహద్దుల వెంట క్లిష్టమైన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపట్టడమే ఈ విభాగం పని. సరిహద్దుల్లో రోడ్లు సరిగ్గా లేని ప్రాంతాల్లో సైన్యం తరలింపు ప్రభుత్వానికి సవాలుగా మారింది. అలాంటి ప్రాంతాల్లో పెట్రోలింగ్ లేకపోవడంతో అక్రమ చొరబాటుదారులకు, శత్రుదేశాలకు అదొక వరంగా పనిచేస్తోంది. అందుకే అలాంటి సమస్యలను ఎదుర్కునే వ్యూహాల్లో భాగంగా కేంద్రం ఈశాన్య భారత్‌లో సరిహద్దుల వెంట అనేక ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేస్తోంది.  

Tags:    

Similar News