Uttarakhand Avalanche: మంచు చరియలు విరిగిపడిన ఘటనలో నలుగురి మృతి, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Uttarakhand Avalanche: మంచు చరియలు విరిగిపడిన ఘటనలో నలుగురి మృతి, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Uttarakhand Avalanche latest updates: ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందిని రెస్క్యూ టీమ్ కాపాడింది. ఇప్పటికీ ఇంకో ఐదుగురి ఆచూకీ లభించలేదు. వారి కోసం ఇండియన్ ఆర్మీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక్కడ నిరంతరంగా కురుస్తోన్న మంచు సహాయ చర్యలకు ఆటంకంగా మారింది. అయినప్పటికీ రెస్క్యూ టీమ్ తమ ప్రయత్న లోపం లేకుండా వారిని కాపాడటం కోసం కృషి చేస్తున్నాయి. మంచు చరియల కింద నుండి బయటికి తీసుకొచ్చిన వారిని సహాయ బృందాలు మనలోని ఐటిబిపి శిబిరంలో చికిత్స అందిస్తున్నారు.
3,200 మీటర్ల ఎత్తులో ఇదే చివరి గ్రామం
ఘటన జరిగిన మన గ్రామం ఇండో టిబెటన్ సరిహద్దుల్లో చివరి గ్రామం. సముద్రమట్టానికి 3200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. బద్రినాథ్‌కు సమీపంలో ఉన్న మన గ్రామంలో గత కొన్ని రోజులుగా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ రోడ్డు నిర్మాణం పనులు చేస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం 5:30 నుండి 6 గంటల మధ్య వీళ్లు ఉంటున్న శిబిరంపై మంచు చరియలు కుప్పకూలాయి. అప్పటికే విపరీతంగా మంచు కురుస్తోంది. కార్మికులు అందరూ మంచి నిద్రలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది.
చమోలి జిల్లాకు వాతావరణ శాఖ హెచ్చరికలతో వేగం పెంచిన రెస్క్యూ టీమ్
రాత్రంతా మంచు కురుస్తున్నప్పటికీ అంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ దాదాపు 65 మందికిపైగా సభ్యులు ఉన్న రెస్క్యూ టీమ్స్ బాధితులును కాపాడేందుకు క్షణం తీరిక లేకుండా పనిచేశాయి. చమోలి జిల్లాల్లో వర్షంతో పాటు మరింత మంచు కురిసే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రెస్క్యూ టీమ్ తమ పనుల్లో మరింత వేగం పెంచింది.
డెహ్రాడూన్, రుద్రప్రయాగ్, ఉత్తర కాశీ, టెహ్రీ, పారి, పితోరగఢ్, బాగేశ్వర్, అల్మోర, నైనితాల్, చంపావత్ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది. అదే కానీ జరిగితే మనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించడం మరింత క్లిష్టం అవుతుంది. అందుకే మంచు చరియల కింద నుండి బాధితులను కాపాడటంలో రెస్క్యూ టీమ్స్ క్షణం తీరికలేకుండా పనిచేస్తున్నాయి.
ఈ సహాయ కార్యక్రమాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా పాల్పంచుకుంటోంది. వైమానిక దళానికి చెందిన IAF Mi-17 హెలీక్యాప్టర్స్ శనివారం ఉదయమే మనకు చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు ఈ హెలిక్యాప్టర్స్ పనిచేస్తున్నాయి.