అయోధ్య నుండి 30 కిలోమీటర్ల దూరం.. ధన్నిపూర్ గ్రామంలో నూతన మసీదు నిర్మాణం!
లక్నో-గోరఖ్‌పూర్ రహదారిపై అయోధ్యకు 30 కిలోమీటర్ల దూరంలో ధన్నిపూర్ అనే గ్రామం ఉంది. మొన్నటివరకు హైవేలో ప్రయాణించే చాలా మందికి ఈ గ్రామం గురించి పెద్దగా తెలియలేదు.. కానీ, ఇప్పుడు చాలా మంది ఆరా తీయడం మొదలుపెట్టారు. ఎందుకంటే రౌనాహికి సమీపంలో ఉన్న ఈ గ్రామాన్ని ఐదు ఎకరాల మసీదు నిర్మాణం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది.
అయోధ్యలోని బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదానికి కారణమైన 2.77 ఎకరాల భూమి విషయంలో తుది తీర్పు వెలువరించిన సుప్రీం.. వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని స్పష్టం చేసింది. దీంతో రామాలయ నిర్మాణానికి మార్గం సుగమం అయింది. ఈ క్రమంలో ధన్నీపూర్‌లో నూతన మసీదును నిర్మించాలని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు దాదాపు నిర్ణయించింది. ఈ గ్రామం హైవేకి 200 మీటర్ల దూరంలో ఉంది.
దాంతో మసీదుకు ఐదు ఎకరాలు స్థలం ఇస్తోంది సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు. ఇది సుప్రీంకోర్టు ఆదేశానికి అనుగుణంగా ఉంది. సమన్యాయంతో మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాలను కేటాయించాలని సుప్రీం పేర్కొన్న సంగతిని అనుసరించి సున్నీవక్ఫ్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ గ్రామంలో దాదాపు 60 శాతం మంది ముస్లిం ప్రజలు.. మిగిలిన వారిలో ఎక్కువగా యాదవులు నివసిస్తున్నారు. వీరిలో చాలా మంది ఇక్కడ మసీదును నిర్మించడాన్ని తప్పుబడుతున్నారు..
ముఖ్యంగా యువత. ఇప్పటికే గ్రామంలో ఒక మసీదు ఉండగా మరో మసీదు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. కానీ మరికొందరు అది తమ విశ్వాసంతో అనుసంధానించబడిందని, బాబ్రీ మసీదు ఒకసారి నిలబడిన ప్రదేశంలో కొత్త మసీదును నిర్మించలేమని తెలిసినప్పటికీ ఈ నిర్ణయాన్ని స్వాగతించాలని అభిప్రాయపడుతున్నారు.
'గ్రామం మరియు చుట్టుపక్కల ఉన్న రౌనాహి పట్టణంలో ఇప్పటికే అవసరమైన దానికంటే ఎక్కువ మసీదులు ఉన్నాయి. నమాజ్ సమయంలో కూడా మసీదులు నిండవు. ప్రభుత్వం తప్పనిసరిగా భూమిని అందించాలని సుప్రీంకోర్టు నిర్ణయించి ఉంటే, అది భూమి గురించి మాత్రమే అయితే, ఐటిఐ కళాశాల లేదా ఆసుపత్రిని ఎందుకు నిర్మించకూడదు? 25 కిలోమీటర్ల దూరంలో ఐటిఐ అలాగే ఆస్పత్రులు కావాలి, మసీదులు కాదు,' అని 34 ఏళ్ల షబాన్ ఖాన్ అన్నారు. అతను యుఎస్ లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ అని చెప్పారు.
కానీ 36 ఏళ్ల నఫీస్ ఖాన్ మాత్రం షబాన్ ఖాన్ నిర్ణయాన్ని అంగీకరించలేదు. 'ఇది మసీదు కోసం ఇచ్చే భూమి, ఇక్కడ ఒక మసీదు ఉండాలి. కళాశాలలు, ఆసుపత్రుల కోసం భూమిని ఎప్పుడైనా చూసుకోవచ్చు. కానీ ఇది మా విశ్వాసంతో నేరుగా అనుసంధానించబడిన విషయం. ఇక్కడ మసీదు నిర్మించకపోతే బాబ్రీ మసీదును కూల్చి వేసిన తరువాత ఈ విషయాన్నీ ఎప్పుడైనా మరచిపోవచ్చు' అని పేర్కొన్నాడు.
ధన్నిపూర్‌లో మూడు మసీదులు ఉన్నాయని.. పొరుగున ఉన్న రౌనాహి పట్టణంలో డజను ఉన్నాయి అని గ్రామస్థులు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖకు చెందిన ఈ భూమి గోధుమలు, వరి పండించడానికి ఉపయోగపడుతోందని మహ్మద్ ఇస్లాం ఖాన్ (58) తెలిపారు. అంతేకాదు గోధుమ పొలం మధ్యలో షాగడ షా పుణ్యక్షేత్రం ఉందని.. అందులో ఒక రాయిపై ఉన్న శాసనం శతాబ్దాల నాటిదని ఇస్లాం ఖాన్ చెప్పారు. అయితే ఈ మందిరాన్ని తాకకుండా మసీదు నిర్మిస్తామని జిల్లా పరిపాలన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మసీదు నిర్మాణానికి అనువైన భూమి ఇదేనని ఆయన అన్నారు.
ఈ భూమి వ్యవసాయ శాఖకు చెందినదని.. ఈ ఐదు ఎకరాల భూమి ముస్లిం పక్షానికి ఇవ్వబడుతుందని అన్నారు. అయితే ఈ భూమి మధ్యలో ఉన్న మందిరాన్ని అలాగే వదిలివేస్తామని స్పష్టం చేశారు. మసీదు నిర్మాణానికి తాము చాలా ప్రదేశాలను షార్ట్‌లిస్ట్ చేశామని.. కాని అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవలసి వచ్చిందని.. చరిత్రను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఊరిని ఎందుకున్నట్టు తెలిపారు.. అలాగే రామ జన్మభూమి దగ్గర లేదా పరిక్రమ మార్గ్‌లో ఎక్కడో ఒకచోట భూమిని ఇవ్వడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడే ఒక వివాదం నుండి బయటపడి మళ్ళీ అదే వివాదాన్ని తిరగదోడటానికి సిద్ధంగా లేము అని ఆ అధికారి స్పష్టం చేశారు.