Maharashtra: ‘మహా’ విషాదం.. ఆస్పత్రిలో ఒకేరోజు 12మంది శిశువులు సహా 24 మంది మృతి

Maharashtra: చికిత్స, ఔషధాలు సకాలంలో అందకపోవడంవల్లేనన్న ఆస్పత్రి డీన్

Update: 2023-10-03 05:38 GMT

Maharashtra: ‘మహా’ విషాదం.. ఆస్పత్రిలో ఒకేరోజు 12మంది శిశువులు సహా 24 మంది మృతి

Maharashtra: మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో ఉన్న శంకర్రావ్ చవాన్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోర విషాదం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది నవజాత శిశువులు సహా 24 మంది మరణించారు. చనిపోయినవారిలో 12 మంది నవజాత శిశువులు ఉండటం అందర్నీ కలిచివేసింది. ప్రభుత్వ దవాఖానాల్లో వసతులలేమి, సిబ్బంది కొరతే ఈ మరణాలకు కారణమని బాధిత కుటుంబాలు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వీరందరికి సకాలంలో చికిత్స, ఔషధాలు అందకపోవడం వల్లే మరణించారని తెలుస్తోంది. ఓవైపు ఈ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య భారీగా పెరగగా.. మరోవైపు ఆస్పత్రి నుంచి ఎంతోమంది నర్సులను వెంట వెంటనే బదిలీ చేయడంతో రోగులకు సత్వర చికిత్స అందించలేని పరిస్థితి ఏర్పడిందని సమాచారం. మందుల కొరత కారణంగానే మరణాలు సంభవించాయని శంకర్‌రావు చవాన్ ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు తెలిపారు. మరణించిన 12 మంది చిన్నారుల్లో ఆరుగురు బాలికలు, ఆరుగురు బాలురు ఉన్నారని ఆసుపత్రి డీన్ తెలిపారు. చనిపోయిన పన్నెండు మంది పెద్ద వారు పాము కాటుతో సహా వివిధ వ్యాధుల కారణంగా మరణించారని ఆయన తెలిపారు. 

అయితే ఆస్పత్రి కేవలం తృతీయ స్థాయి సంరక్షణ కేంద్రం అని, అది కూడా 70 నుంచి 80 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఏకైక ఆరోగ్య సంరక్షణ కేంద్రం కావడంతో వివిధ ప్రాంతాల నుండి రోగులు వస్తుంటారని తెలిపారు. ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య కొన్నిసార్లు ఇన్‌స్టిట్యూట్ బడ్జెట్‌ను మించిపోతుందని, అందుకే మందుల కొరత ఏర్పడిందని ఆస్పత్రి డీన్ తెలిపారు. ఇంకా చాలా మంది ఆస్పత్రి సిబ్బంది బదిలీ అయినట్లు తెలిపారు. హాఫ్‌కిన్ అనే సంస్థ నుంచి మందులను ఆసుపత్రి కొనుగోలు చేయాల్సి ఉందని, అయితే అది జరగలేదని డీన్ చెప్పారు. స్థానిక దుకాణాల్లో కొనుగోలు చేసిన తర్వాత రోగులకు మందులు అందజేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News