Sonali Bendre: క్యాన్స‌ర్ గురించి అందుకే చెప్పాల్సి వ‌చ్చింది.. సోనాలి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Sonali Bendre: ఒకప్పుడు హిట్‌ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ నటి సోనాలి బింద్రే, కొన్నేళ్ల క్రితం తీవ్రమైన ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

Update: 2025-05-14 16:02 GMT

Sonali Bendre: ఒకప్పుడు హిట్‌ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ నటి సోనాలి బింద్రే, కొన్నేళ్ల క్రితం తీవ్రమైన ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 2018లో ఆమెకు మెటాస్టాటిక్ క్యాన్సర్ నిర్ధారణ కావడంతో, తానే స్వయంగా ఈ విషయం గురించి వెల్లడించారు. ఆ సమయంలో ఆమె చూపిన ధైర్యం, ఆత్మస్థైర్యం చాలా మందికి ఆదర్శంగా నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి, తన ఆరోగ్య స్థితిని ఎందుకు స్వయంగా వెల్లడించాల్సి వచ్చిందో స్పష్టం చేశారు.

‘‘నాకు క్యాన్సర్ వచ్చిందన్న విషయాన్ని అప్పట్లో అందరితో పంచుకోవాలనే ఆలోచన లేదు. కానీ, ఆ సమయంలో ఓ టెలివిజన్ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాను. ప్రతి వారం ఓ ఎపిసోడ్ ప్రసారం అవుతుండేది. ఇంతలోనే చికిత్స కోసం వెళ్లాల్సి వచ్చింది. నేను అకస్మాత్తుగా కనిపించకపోతే, ఎవరి వారు ఊహించుకుని రకరకాలుగా మాట్లాడతారని తెలిసింది. సోషల్ మీడియా గాసిప్స్ వల్ల నా కుటుంబ సభ్యులు బాధపడతారనే ఆందోళన కలిగింది. ముఖ్యంగా నా కుమారుడిపై దాని ప్రభావం పడకూడదనిపించింది. అందుకే ఆరోగ్య పరిస్థితిని ధైర్యంగా బయటపెట్టాలని నిర్ణయించుకున్నాను’’ అని తెలిపారు సోనాలి.

ఈ ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ ఆరంభ దశ గురించి కూడా తెలిపారు. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు తన లుక్స్ కారణంగా చాలా అవకాశాలను కోల్పోయానని చెప్పిన ఆమె, ఆ సమయంలో ఎదురైన సవాళ్లు తనకు కొత్త అనుభవాల్ని నేర్పాయన్నారు.

సోనాలి బింద్రే, క్యాన్సర్‌ను జయించిన తర్వాత ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన క‌ల్పిస్తున్నారు. ‘‘క్యాన్సర్ అనేది జీవితాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది – ఒకటి ముందటి జీవితం, రెండు తర్వాతి జీవితం. ఇది నాకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పింది. మన జీవితం ఏ పరిస్థితుల్లోనైనా ఆగకూడదు. ట్రీట్‌మెంట్ రోజులు నా జీవితంలోని అత్యంత కఠినమైన దశగా మిగిలిపోయాయి’’ అని ఆమె గతంలో కూడా పేర్కొన్నారు.

Tags:    

Similar News