Rajpal Yadav Jailed: బాలీవుడ్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్‌కు జైలు శిక్ష.. తిహాడ్ అధికారుల ముందు లొంగిపోయిన నటుడు!

Rajpal Yadav Jailed: ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్‌కు న్యాయస్థానంలో భారీ షాక్ తగిలింది.

Update: 2026-02-06 08:54 GMT

Rajpal Yadav Jailed: ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్‌కు న్యాయస్థానంలో భారీ షాక్ తగిలింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న చెక్ బౌన్స్ కేసులో ఆయన గురువారం సాయంత్రం ఢిల్లీలోని తిహాడ్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. కోర్టు ఇచ్చిన గడువు ముగియడం, అదనపు సమయం ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించడంతో ఆయన కటకటాల వెనక్కి వెళ్లక తప్పలేదు.

అసలేం జరిగింది?

ఈ వివాదం 2010లో ప్రారంభమైంది. రాజ్‌పాల్ యాదవ్ తన దర్శకత్వ రంగ ప్రవేశం కోసం 'మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్' అనే సంస్థ నుంచి రూ. 5 కోట్ల అప్పు తీసుకున్నారు. ఈ బాకీని తీర్చే క్రమంలో రాజ్‌పాల్ దంపతులు ఇచ్చిన చెక్కులు బ్యాంకులో బౌన్స్ అయ్యాయి. దీంతో సదరు సంస్థ కోర్టును ఆశ్రయించింది. 2018లోనే ఢిల్లీ మెజిస్ట్రేట్ కోర్టు ఆయనకు 6 నెలల జైలు శిక్ష విధించింది. దీనిపై ఆయన సెషన్స్ కోర్టు, హైకోర్టులకు వెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. 2024లో హైకోర్టు శిక్షపై స్టే ఇస్తూ బాకీ చెల్లించాలని ఆదేశించినా, ఆ హామీని నెరవేర్చడంలో ఆయన విఫలమయ్యారు. దీంతో కోర్టు కఠినంగా వ్యవహరించి తక్షణమే శిక్షను అమలు చేయాలని ఆదేశించింది.

కెరీర్ హైలైట్స్

రాజ్‌పాల్ యాదవ్ బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ‘భూల్ భూలయ్య’, ‘హంగామా’, ‘చుప్ చుప్ కే’ వంటి చిత్రాల్లో ఆయన చేసిన కామెడీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. మాస్ మహారాజా రవితేజ నటించిన ‘కిక్ 2’ సినిమాలో ఒక కీలక పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, పాత కేసుల కారణంగా ఆయన జైలు పాలు కావడం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News