ఆ అల్లా ఎంత రాసి పెట్టి ఉంటే అంతే బతుకుతాం - లారెన్స్ బెదిరింపులపై సల్మాన్ ఖాన్ రియాక్షన్
ఆ అల్లా ఎంత రాసి పెట్టి ఉంటే అంతే బతుకుతాం - లారెన్స్ బెదిరింపులపై సల్మాన్ ఖాన్ రియాక్షన్
Salman Khan about death threats from Lawrence Bishnoi: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వేదాంత ధోరణిలోకి వెళ్లిపోయారు. సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఎప్పటి నుండో బెదిరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గతేడాది ఏప్రిల్‌లో సల్మాన్ ఖాన్ ఉంటున్న గెలాక్సీ అపార్ట్‌మెంట్‌పై కాల్పులు జరిగాయి. అది లారెన్స్ బిష్ణోయ్ చేయించిన పనేనని ముంబై పోలీసుల విచారణలో తేలింది. అదేకాకుండా ఆ తరువాత కూడా అనేక సందర్భాల్లో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని లారెన్స్ హెచ్చరికలు జారీచేస్తూనే ఉన్నాడు.
గతేడాది సల్మాన్ ఖాన్ సన్నిహిత మిత్రుడు, ఎన్సీపీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖి హత్య జరిగింది. లారెన్స్ గ్యాంగ్ లోని ముఠా సభ్యులే సిద్ధిఖిని హత్య చేశారు. సిద్ధిఖిని చంపడానికి కారణం కూడా ఆయన సల్మాన్‌తో సాన్నిహిత్యంగా ఉండటమేననే ముంబై పోలీసులు అనుమానించారు. సిద్ధిఖి హత్యతో తన సత్తా ఏంటో సల్మాన్ ఖాన్‌కు చెప్పాలనే ఆలోచనతోనే లారెన్స్ ఈ హత్య చేయించినట్లు విచారణలో బయటికొచ్చింది.
బాబా సిద్ధిఖి మర్డర్ ఘటన తరువాత సల్మాన్ ఖాన్‌కు భద్రతను పెంచారు. ఆయన కూడా గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద ఇంటి చుట్టూ కట్టిదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ కారు మెయింటెన్ చేస్తున్నారు.
సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ మూవీ రంజాన్ పండగ సందర్భంగా ఈ నెల 30న ఆడియెన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం సల్మాన్ సికందర్ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగానే తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన... లారెన్స్ బెదిరింపులపై స్పందించారు. "ఆ దేవుడు అల్లా ఉన్నాడు. ఆయన మనకు ఎంత కాలం బతకాలని రాసి పెడితే, అంత కాలం బతుకుతాం. అంతకు మించి భయపడటానికి ఇంకేమీ లేదు" అని సల్మాన్ అభిప్రాయపడ్డాడు. లారెన్స్ బెదిరింపుల నేపథ్యంలో గట్టి భద్రత మధ్య తిరగాల్సి రావడంపై స్పందిస్తూ సల్మాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
సల్మాన్ ఖాన్ మాటలను బట్టి చూస్తే... "జీవితంలో ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం అసలే లేదు. సమస్య ఏదైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలంతే" అని చెప్పకనే చెప్పినట్లుగా అనిపిస్తోంది అని అభిమానులు అనుకుంటున్నారు.
ఇక సికందర్ మూవీ విషయానికొస్తే... ఇండియాలో టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన ఏ.ఆర్. మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, రష్మిక మందన జంటగా నటించారు. సత్యరాజ్, కాజల్ అగర్వాల్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియడ్‌వాలా ఈ సినిమాను నిర్మించాడు. మార్చి 30న సికందర్ మూవీ రిలీజ్ అవుతోంది.