అన్నయ్య కరోనా నుంచి తొందరగా కోలుకోవాలి : పవన్ కళ్యాణ్

అన్నయ్య చిరంజీవి గారు సత్వరమే కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. కరోనా వైరస్‌ కు వ్యాక్సిన్‌ కోసం సాగుతున్న ప్రయోగాలు త్వరగా ఫలవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను

Update: 2020-11-10 10:23 GMT

తెలుగు సినీ పరిశ్రమను కరోనా మహమ్మారి నీడలా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకోగా.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి వైరస్ సోకిన వారి లిస్ట్ లో చేరారు. ఆచార్య సినిమా షూటింగ్ ప్రారంభంకానున్న నేపథ్యంలో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు చిరంజీవి. అయితే, కరోనా పాజిటివ్ రావడంతో ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

చిరంజీవికి కరోనా పాజిటివ్ రావడంతో టాలీవుడ్ ప్రముఖులతో పాటుగా అభిమానులు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.. ఇక ఆయన త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులు పూజలు చేస్తున్నారు. తన అన్నయ్య చిరంజీవి కరోనా నుంచి కోలుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు.. ఈ మేరకు పవన్ ఓ లేఖ రాశారు.

" అన్నయ్య శ్రీ చిరంజీవి గారు లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడమే కాదు ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగించారు. సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ప్రజారోగ్యంపై ఎంతో అవగాహన ఉన్న అన్నయ్య తన ఆరోగ్యంపట్లా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలో అన్నయ్య శ్రీ చిరంజీవి గారు కరోనా బారినపడటంతో మేమంతా విస్తుపోయాం. ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. పరీక్షల్లో మాత్రం పాజిటివ్‌ అని తేలింది.

అన్నయ్య శ్రీ చిరంజీవి గారు సత్వరమే కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. కరోనా వైరస్‌ కు వ్యాక్సిన్‌ కోసం సాగుతున్న ప్రయోగాలు త్వరగా ఫలవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రపంచం అంతా ఆ వ్యాక్సిన్‌ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాయి. మరో వైపు కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రమాదం ఉందనే వైద్య ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు చూస్తున్నాం. జాగ్రత్తలు పాటించడంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. " అని పవన్ కళ్యాణ్ ఆ లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News