Oscar Race 2026: ఆస్కార్ బరిలో మహావతార నరసింహ.. యానిమేటెడ్ మూవీ విభాగంలో పోటీకి అర్హత
2025లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో మహావతార నరసింహ యానిమేటెడ్ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
Oscar Race 2026: ఆస్కార్ బరిలో మహావతార నరసింహ.. యానిమేటెడ్ మూవీ విభాగంలో పోటీకి అర్హత
Oscar Race 2026: 2025లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో మహావతార నరసింహ యానిమేటెడ్ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు మరో పెద్ద వార్తతో సంచలనం సృష్టిస్తోంది. 2026లో జరిగే ఆస్కార్ అవార్డుల బరిలో ఈ సినిమా పోటీ పడటానికి అర్హత సాధించింది. యానిమేటెడ్ సినిమా విభాగంలో ఈ చిత్రం పోటీ పడుతోంది. ఈ సినిమా ద్వారా భారత్‌కు మరో ఆస్కార్ అవార్డు దక్కుతుందా అనే ఆసక్తి సినీ అభిమానుల్లో పెరిగింది.
ఈ ప్రతిష్టాత్మక యానిమేటెడ్ చిత్రాన్ని హోంబళే ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది. ఇది పురాణ కథాంశాన్ని కలిగి ఉంది. అశ్విన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నరసింహ పురాణం, విష్ణు పురాణం, శ్రీమద్ భాగవత పురాణాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా హిందీ, కన్నడ, తెలుగు, తమిళ భాషలలో జూలై 25న విడుదలైంది. భారతదేశంలో యానిమేటెడ్ సినిమాలకు కూడా పెద్ద మార్కెట్ ఉందని ఈ చిత్రం నిరూపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 326 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఆస్కార్ రేసులో నిలవడం ద్వారా మరింత వార్తల్లో నిలిచింది.
2026 ఆస్కార్ నామినేషన్స్ కోసం చివరి దశలో 35 యానిమేటెడ్ సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇందులో మహావతార నరసింహ కూడా ఉంది. ఒకవేళ మహావతార నరసింహ సినిమా ఆస్కార్ నామినేషన్ జాబితాలోకి ఎంపికైతే, ఆస్కార్‌కు నామినేట్ అయిన భారతదేశపు మొట్టమొదటి యానిమేటెడ్ సినిమాగా రికార్డు సృష్టిస్తుంది. అందుకే తుది నామినేషన్స్ జాబితాపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈసారి ఆస్కార్ రేసులో భారత్ నుంచి నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన హోమ్‌బౌండ్ అనే హిందీ సినిమా కూడా ఉంది. ఈ చిత్రం ఉత్తమ అంతర్జాతీయ కథాచిత్రం విభాగంలో అధికారికంగా భారత్ తరఫున ఎంపికైంది. 2026, జనవరి 22న 98వ అకాడమీ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్ జాబితా ప్రకటిస్తారు.2026 మార్చి 15న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఆ రోజు ఈ సినిమాలు ఆస్కార్ గెలుస్తాయా లేదా అనేది తెలిసిపోతుంది.